calender_icon.png 5 January, 2026 | 9:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఒక్క చుక్క పోనివ్వం

04-01-2026 01:07:33 AM

  1. సాగునీటి శాఖను సర్వ నాశనం చేసిందే బీఆర్‌ఎస్ 
  2. ‘పాలమూరు-రంగారెడ్డి’పై దగా చేశారు 
  3. ప్రాజెక్టు మార్చడమే చారిత్రక తప్పిదం 
  4. ‘పాలమూరు-రంగారెడ్డి’పై కుట్ర పూరితంగానే జాప్యం 
  5. బీఆర్‌ఎస్ పాపాలను మా నెత్తిమీద మోపారు 
  6. కేవలం రూ. 7,469 కోట్లు ఖర్చు పెడితే ప్రాజెక్టులన్నీ పూర్తయ్యేవి
  7. కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులను ప్రాధాన్యతతో మూడేళ్లలో పూర్తిచేస్తాం 
  8. నల్లమల సాగర్‌కు సీడబ్ల్యూసీ అనుమతుల్లేవు 
  9. పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

హైదరాబాద్, జనవరి 3 (విజయక్రాంతి) : రాష్ట్ర సాగునీటి శాఖను బీఆర్‌ఎస్ ప్రభుత్వం సర్వనాశనం చేసిందని, ఎక్కడా ప్రాజెక్టు మొదలు పెట్టలేదని, కట్టిన ఒక్క ప్రాజెక్టు కూలిపోయిందని  నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము వచ్చాకనే 7 వేల కోట్లు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు ఖర్చు చేశామని తెలిపారు. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుపై బీఆర్‌ఎస్ ప్రభుత్వం మోసం, దగా చేసిందని మండిపడ్డారు. ఈ ప్రాజెక్టు విషయంలో బీఆర్‌ఎస్ చారిత్రక తప్పిదం చేసిందన్నారు.

జూరాల తెలంగాణ ప్రాంతంలో ఉంద ని, అక్కడ ప్రాజెక్టును చేపడితే 32 వేల కోట్లతో ఎప్పుడో ప్రాజెక్టు పూర్తయ్యేదని, కానీ దాన్ని శ్రీశైలం వద్దకు మార్చడంతో న్యాయపరమైన చిక్కులు వస్తున్నాయని తెలిపారు. ప్రాజెక్టు నిర్మించే ప్రాంతం మార్చడం ద్వారా ఖర్చు రెండింతలు, మూడింతలు పెరగడమే తప్ప ప్రయోజనమేమీ లేదన్నారు. కాంగ్రెస్ ప్రభు త్వం వచ్చినప్పుడు 40 వేల కోట్లు పెండింగ్ పెట్టి వెళ్లారని, అందులో  10,900 కోట్లు పెండింగ్ పెట్టి పోయిన ఘనత గత ప్రభుత్వానిదన్నారు.

పీఆర్‌ఎల్‌ఐసీ పేరిట తీవ్ర ఆర్థిక భారం వేసి కూడా నీళ్లిచ్చింది లేదన్నారు. కృష్ణా బేసిన్‌లోని అన్ని ప్రాజెక్టులకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి మూడేళ్లలో పూర్తి చేస్తామని ప్రకటించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పబ్లిక్ హియరింగ్‌ను ఎండలు ఎక్కువగా ఉన్నాయని కేసీఆర్ పోస్టుపోన్ చేశారని గుర్తు చేశారు. శనివారం అసెంబ్లీలో కృష్ణా నదీ జలాలపై స్వల్పకాలిక చర్చలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ ప్రాజెక్టు పనులను బీఆర్‌ఎస్ ప్రభుత్వం కుట్ర పూరితంగా జాప్యంచేసి ఉమ్మడి మహబూ బ్‌నగర్ రైతాంగానికి తీరని నష్టం చేసిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. కానీ హరీష్‌రావు మాత్రం 90 టీఎంసీల కోసం బీఆర్‌ఎస్ కొట్లాడిదంటూ పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 2022లో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారమే మేము కూడా ముందుకు వెళ్తున్నామని స్పష్టం చేశారు. 90 టీఎంసీల్లో కనీసం ప్రస్తుతం మైనర్ ఇరిగేషన్ సేవింగ్‌కు సంబంధించిన 45 టీఎంసీలైనా ఇవ్వాలని లేఖ రాస్తే దానిని బీఆర్‌ఎస్ నాయకులు వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు.

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని అనుమతులను సాధించి 90 టీఎంసీలతో మూడేళ్లలో పూర్తి చేస్తామని ప్రకటించారు. ప్రతి ప్రాజెక్టు డీపీఆర్ వాపస్ రావడం సహజమని, వాళ్ల హయాంలోనూ రెండు వాపస్ వచ్చిందన్నారు. మైనర్ ఇరిగేషన్ డేటా అడిగితే ఆ వివరాలు కూడా ఇచ్చామని, బీఆర్‌ఎస్ చేసిన తప్పులను సరిచేస్తున్నామని స్పష్టం చేశారు. కానీ బీఆర్‌ఎస్ నాయకులు మాత్రం వారు చేసిన పాపాలు మా నెత్తి మీద మోపే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో ఒక పంపు ఆన్ చేసి 3-4 గంటల నడిపించి ఆపేశారని గుర్తు చేశారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన భూ సేకరణలో జాప్యం చేయడంతోనే ఖ ర్చు రూ. 84 వేల కోట్లకు పెరిగిందన్నారు. ఈ ప్రాజెక్టుపై వారు 26,262 కోట్లు ఖర్చు చేయగా అది మొత్తం అంచనాలో 32 శాత మే అని, అయినా ఇంకా 39 వేల ఎకరాల భూసేకరణ పెండింగ్‌లో ఉందని స్పష్టం చేశారు.

2015లో శంకుస్థాపన చేసినప్పుడు మూడేళ్ల ప్రాజెక్టును పూర్తి చేస్తామని ప్రకటించారని, కానీ ఇప్పటికీ కేవలం 30 శాతం పనులు మాత్రమే పూర్తి అయ్యాయని తెలిపారు. కేసీఆర్ కుర్చీ వేసుకుని ప్రాజెక్టు కట్టిస్తానని చెప్పారని, కానీ కుర్చీ ఎటు పోయిందో, ఆయన ఎటు పోయారో తెలియడం లేదని ఎద్దేవా చేశారు. 

రాబోయే మూడేళ్లలో అన్ని ప్రాజెక్టులు పూర్తి..

గత ప్రభుత్వం దిగిపోయే వరకు కూడా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి (పీఆర్‌ఎల్‌ఐఎస్)కు హైడ్రాలజీ క్లియరె న్స్, ఎన్విరాన్‌మెంటల్ క్లియరెన్స్, ఇరిగేషన్ ప్లానింగ్ క్లియరెన్స్, ఇంటర్ స్టేట్ క్లియరెన్స్ లేదని వెల్లడించారు. 90 టీఎంసీల్లో 45 టీఎంసీలు గోదావరి నీళ్ల మళ్లిం పు, 45 టీఎంసీలు మైనర్ ఇరిగేషన్ సేవింగ్ కోసమని గత ప్రభుత్వం చెప్పినట్టుగానే మేము కూడా ముందుకు పోతున్నామని స్పష్టం చేశారు. 90 టీఎంసీలతో పీఆర్‌ఎల్‌ఐసీని ముందుకు తీసుకెళ్తామని, ఎవరెన్నీ అవాస్తవాలు చెప్పినా నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు జూరాల సోర్స్‌గా ఉన్న పీఆర్‌ఎల్‌ఐసీ ప్రాజెక్టును శ్రీశైలం వద్ద మార్చి తెలంగాణకు తీర ని నష్టం చేసింది

బీఆర్‌ఎస్ ప్రభుత్వమని విమర్శించారు. కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులపై గత ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిం చిందన్నారు. రాబోయే మూడేళ్లలో కల్వకుర్తి,  నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్, పాలమూరు-రంగారెడ్డి, కొడంగల్ నారాయణ్ పేట్, నల్గొండలోని ఎస్‌ఎల్‌బీసీ, బ్రహ్మణ వెల్లంల, డిండి సహా కృష్ణా బేసిన్‌లోని అన్నీ ప్రాజెక్టులను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. 

రూ. 7,469 కోట్లు ఖర్చు పెడితే..  

2014లో కేసీఆర్ అధికారంలోకి వచ్చిన వెంటనే రూ. 7,469 కోట్లు ఖర్చు పెడితే ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ లిఫ్ట్ స్కీములు పూర్తి అయి 8.65 లక్షల ఎకరాలకు నీరు అందేదని తెలిపారు. కానీ పదేళ్ల బీఆర్‌ఎస్ ప్రభుత్వ పాలనలో 1.87 లక్షల కోట్లు సాగునీటి ప్రాజెక్టులకు ఖర్చు పెట్టినప్పటికీ ఉమ్మడి మహబూబ్‌నగర్‌కు సంబంధించిన ప్రాజెక్టులకు మాత్రం కేవలం రూ. 7,469 కోట్లు కూడా ఖర్చు చేయలేదని విమర్శించారు.

తెలంగాణకు 299 టీఎంసీల వాటాకు ఒప్పుకుని రాష్ట్రానికి శాశ్వతంగా మరణ శాసనం రాశారని మండిపడ్డారు. బీఆర్‌ఎస్ పాలకులు ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం 11 శాతం వడ్డీ రేటుకు అప్పులు తీసుకొస్తే.. మేం అధికారంలో వచ్చిన మొదటి సంవత్సరంలో ఇరిగేషన్ శాఖకు కేటాయించిన రూ.24 వేల కోట్లలో రూ. 16 వేల కోట్లు వడ్డీల కిందనే సరిపోయాయని గుర్తు చేశారు. ఇరిగేషన్ శాఖకు సంబంధించిన అప్పుల వడ్డీ రేటును 7 శాతానికి తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందని, ఇందులో కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించిందని వెల్లడించారు. 

ఎంత వరకైనా కొట్లాడుతాం.. 

అన్ని విధాలా తెలంగాణకు సంబంధించిన కృష్ణా నదీ జలాల హక్కుల కాపాడుతామని స్పష్టం చేశారు. పోలవరం-నల్లమల సాగర్‌కు సీడబ్ల్యూసీ అనుమతులు ఇవ్వలేదని, హరీష్‌రావు ప్రజలకు చూపించే లెటర్ సీడబ్ల్యూసీలోని అంతర్గత శాఖలకు సం బంధించినదని పేర్కొన్నారు. ఆ ప్రాజెక్టుకు, దాని డీపీఆర్‌కు అనుమతి లేదని కేంద్రం లేఖ రాసినట్టు తెలిపారు. అయినా ఈ ప్రా జెక్టును వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో కేసు వేశామని చెప్పారు.

కేంద్ర వేసిన కమిటీపై రాద్ధాంతం చేస్తున్నారని, తెలంగాణ నదీ జ లాల కోసం ఎవరితోనైనా మాట్లాడటానికైనా సిద్ధమని, తెలంగాణ నీటి వాటా హక్కులో ఒక్క చుక్క నీటిని కూడా తీసుకుపోవ్వమని స్పష్టం చేశారు. కృష్ణా నదీ జలాలపై ముఖ్యమైన చర్చ జరుగుతుంటే సభకు రాకపోవడం దురదృష్టమన్నారు. తెలివిలేని పని చేసిందే బీఆర్‌ఎస్ ప్రభుత్వమని, ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు తీవ్ర నష్టం చేశారని మండిపడ్డారు.

తెలంగాణ ప్రజలందరిని తాకట్టు పెట్టి అప్పులు తెచ్చి ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయని కృష్ణా నదీ జల ద్రోహులు బీఆర్‌ఎస్ నాయకులని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేడిగడ్డ బరాజ్ కూలిపోయి ఉన్నా రాష్ట్రం అత్యధిక దిగుబడి, ధాన్యం సేకరణ సాధించడమే కాంగ్రెస్ ప్రభుత్వం సమర్థవంతమైన పనితీరుకు నిదర్శమని తెలిపారు. కృష్ణా జలాల్లో హక్కుల కోసం ఎంత వరకైనా కొట్లాడుతామని, కృష్ణా బేసిన్‌లోని రైతాంగానికి మేలు చేస్తామని స్పష్టం చేశారు. 

జూరాల వద్ద 121 టీఎంసీల కేపాసిటీ..

గత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుపై ఉన్న మోజుతో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును నిర్లక్ష్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత పదేళ్లలో కాళేశ్వరం ప్రాజెక్టు కోసం రూ. 90 వేల కోట్లు వెచ్చిస్తే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై కేవలం రూ. 27 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారని వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పబ్లిక్ హియరింగ్ 2017లో నిర్వహిస్తే, పీఆర్‌ఎల్‌ఐసీకి 2021లో నిర్వహించారని తెలిపారు. పాలమూరు-రంగారెడ్డి పనులను స్లోడౌన్ చేయాలని ఆనాటి ఈఎన్సీ ఇంజినీర్లందరికీ చెప్పిన విష యం ప్రజలందరికీ తెలియాల్సిన అవసరం ఉందన్నారు.

జూరాల వద్దనే పీఆర్‌ఎల్‌ఐసీ సోర్స్ పాయింట్ ఉంటే రోజుకు 2.8 టీఎంసీల నీటి లభ్యత ఉండేదని, తద్వారా 25 రోజుల్లో 75 టీఎంసీల నీటిని వినియోగించుకునేందుకు అవకాశం ఉండేదని, 10 లక్షల ఎకరాలకు నీరు అందేదన్నారు. కేవలం రూ. 32 వేల కోట్లతో ప్రాజెక్టు కూడా పూర్తి అ య్యేదన్నారు. ఆయకట్టు కాలువల పనులు, భూసేకరణ లేకుండా రూ. 55 వేల కోట్లతో సీడబ్ల్యూసీకి డీపీఆర్‌ను సమర్పించారని, కానీ ప్రస్తుత అంచనాల మేరకు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు రూ. 84 వేల కోట్లుగా ఉందన్నారు.

తుమ్మడిహట్టి నుంచి మేడిగడ్డకు ప్రాజెక్టు ఉత్తర తెలంగాణకు అన్యాయం చేసినట్టుగానే పీఆర్‌ఎల్‌ఐసీని జూరాల నుంచి శ్రీశైలం వద్దకు మార్చి ఉమ్మడి మహబూబ్‌నగర్‌కు తీవ్రమైన అన్యాయం చేశారని మం త్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి తోడు జూరాల వద్ద ప్రాజెక్టు ఉంటే స్టోరేజ్ కేపాసిటీ 121 టీఎంసీ ఉండేదని, శ్రీశైలం వద్దకు మార్చడం 68 టీఎంసీలకు తగ్గిందన్నారు. 

బీఆర్‌ఎస్ హయాంలోనే..

మేడిగడ్డ వద్ద 16 టీఎంసీలు, అన్నారం వద్ద 12 టీఎంసీలు, సుందిళ్ల 9 టీఎంసీల స్టోరేజ్ కేపాసిటీ ఉంటుందని, అయితే 9 టీఎంసీ కేపాసిటీ ఉన్న సుందిళ్ల నుంచి 195 టీఎంసీల నీటిని ఎత్తిపోస్తామని బీఆర్‌ఎస్ దుష్ప్రచారం చేసిందన్నారు. కానీ జూరాల నుంచి లిఫ్ట్ చేసేందుకు మాత్రం కేపాసిటీ తక్కువగా ఉందని చెప్పిందని విమర్శించారు. ఇందులో అంచనా వ్యయం పెంచే కుట్ర ఉందన్నారు. జూరాల వద్ద నుంచి 22 పంపులతో 414 మీటర్ లిఫ్ట్ చేయాల్సి ఉండగా, శ్రీశైలం నుంచి 37 పంపులతో 560 మీటర్ల ఎత్తు లిఫ్ట్ చేయాల్సి ఉంటుందని తెలిపారు.

2014కు ముందు కృష్ణా బ్యాక్ వాటర్ నుంచి ఏపీ అక్రమంగా రోజుకు 4.47 టీఎంసీలు తరలించగా, పదేళ్ల బీఆర్‌ఎస్ హయాంలో ఏపీ అక్రమంగా తరలించుకునే సామర్థ్యాన్ని 13 టీఎంసీలకు పెంచుకున్నదని వెల్లడించారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా రోజుకు 3 టీఎంసీలను ఏపీ దోచుకునేందుకు ప్రయత్నిస్తుంటే బీఆర్‌ఎస్ నిశబ్దంగా ఉందని, కానీ ఏపీ, కేంద్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొచ్చి ఆ ప్రాజెక్టు పనులు నిలిపివేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు.

గత పన్నెండేండ్లలో ఎప్పుడూ లేని విధంగా కృష్ణ జలాల నుంచి 286 టీఎంసీలను 2024-25 సంవత్సరంలో తెలంగాణ రైతాంగం వినియోగించినట్టు గణాంకాలు చెబుతున్నాయని వెల్లడించారు. 2004-14 వరకు కృష్ణా జలాల నుంచి ఏపీ 730 టీఎంసీలు అక్రమంగా తరలించుకుపోగా, 2014-24 వరకు 1190 టీఎంసీలు తరలించిందని, దీని ఆధారంగా గత పదేళ్లలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏవిధంగా వ్యవహరించిందో అర్థమవుతుందన్నారు. 

గోదావరి బేసిన్‌లో రూ. 1.25 లక్షల కోట్లు, కృష్ణా  బేసిన్‌లో రూ. 41 వేల కోట్లు.. 

బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో గోదావరి బేసిన్‌లోని ప్రాజెక్టులకు రూ. 1.25 లక్షల కోట్లు ఖర్చు చేస్తే, కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులకు మాత్రం కేవలం రూ. 41 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారని వెల్లడించారు. దీంతోపాటు కాళేశ్వరం వద్ద రోజుకు లిఫ్ట్ చేసే సామర్థ్యాన్ని 2 టీఎంసీల 3 టీఎంసీలకు పెంచారని, పాలమూరు రంగారెడ్డి వద్ద 1.5 టీఎంసీ నుంచి 1 టీఎంసీకి తగ్గించి కుట్ర చేశారని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కాంట్రాక్టర్ల కోసం పెంచిన రూ. 27 వేల కోట్లను పాలమూరుపై ఖర్చు పెడితే ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో నీరు పుష్కలంగా పారేవని స్పష్టం చేశారు.

తెలంగాణ, ఏపీ మధ్య నెలకొన్న కృష్ణా జలాల వివాదాలపై బ్రిజేషకుమార్ ట్రిబ్యులన్ ఏడాది లోపు తీర్పు ఇచ్చే అవకాశం ఉందన్నారు. కృష్ణా నదీ జలాల్లో 73 శాతం తెలంగాణకే కేటాయించాలని మేము సమర్థవంతంగా వాదిస్తున్నామని స్పష్టం చేశారు. వాళ్ల హయాంలోనే 299 టీఎంసీలకే ఒప్పకుని ఇప్పుడు చేయలేదని అంటున్నారని.. అసత్యాలు, అబద్ధాలు ప్రచారం చేయడంలో బీఆర్‌ఎస్ నాయకులు గోబెల్స్‌ను మించి పోయారని ఎద్దేవా చేశారు.

వారి హయాంలో ప్రాజెక్టులు పూర్తి కాక జూరాల నుంచి మనకు కేటాయించిన నీటి వాటా ఏ ఒక్క సంవత్సరం కూడా వినియోగించుకోలేదని వెల్లడించారు. కనీసం కృష్ణా జలాల్లో నుంచి రాష్ట్రాల వినియోగం లెక్కించే టెలిమెట్రీ వ్యవస్థను కూడా గత ప్రభుత్వం పెట్టకుండా తీవ్ర అన్యాయం చేసిందని విమర్శించారు. ఆనాడు ఏపీకి మేలు చేసే విధంగా జగన్‌మోహన్‌రెడ్డితో ప్రజా భవన్ వేదికగా కేసీఆర్ సమావేశాలు నిర్వహించారని ఆరోపించారు.

గోదావరి జలాలను తీసుకెళ్లి రాయలసీమను రతనాల సీమ చేస్తామని ప్రకటించారని, కానీ తెలంగాణ జలాల నుంచి ఒక్క చుక్క నీటిని కూడా ఎవరికి వెళ్లకుండా కాంగ్రెస్ ప్రభుత్వం పోరాటం చేస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ కృషి వల్లనే రాయలసీమ లిఫ్ట్ పనులు ఆపగలిగామని తెలిపారు. ఆనాడు కృష్ణా జలాలను ఏపీ అక్రమంగా దోచుకుపోతుంటే బీఆర్‌ఎస్ నోరు మెదుపలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే 763 టీఎంసీలు తెలంగాణకు ఇవ్వాలని గట్టిగా, బలంగా వాదనలు వినిపిస్తున్నామని ఉత్తమ్‌కుమార్ రెడ్డి పేర్కొన్నారు.