04-01-2026 12:57:10 AM
హైదరాబాద్, సిటీ బ్యూరో జనవరి 3 (విజయక్రాంతి): దశాబ్దాలపాటు దండకారణ్యాన్ని తమ కంచుకోటగా మార్చు కుని, ప్రభుత్వాలకు సవాలు విసిరిన మావోయిస్టు పార్టీకి తెలంగాణలో కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టు పార్టీ సైనిక దళానికి వెన్నుముకగా నిలిచిన పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పీఎల్జీఏ) బెటాలియన్ చీఫ్ బర్సే దేవా అలియాస్ సుక్క, పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు కంకణాల రాజిరెడ్డి వెంకటేష్, ఆయన భార్య అడ్లూరి ఈశ్వరి రేమ సహా మొత్తం 20 మంది మావోయిస్టులు శనివారం తెలంగాణ డీజీపీ శివధర్‌రెడ్డి ఎదుట లొంగిపోయారు.
నిజానికి వారు శుక్రవారమే లొంగిపోగా.. ఆ వివరాలను డీజీపీ శనివారం మీడియాకు వెల్లడించారు. లొంగుబాటు సందర్భంగా మావోయిస్టులు పోలీసులకు భారీఎత్తున ఆయుధాలను అప్ప గించారు. మావోయిస్టుల దగ్గర అత్యంత శక్తిమంతమైనవిగా భావించే 48 మౌంటెడ్ లైట్ మెషిన్ గన్స్ వెపన్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇది మావోయిస్టుల ఫైర్ పవర్కు గట్టి దెబ్బగా పోలీసులు అభివర్ణిస్తున్నారు.
అంతేకాకుండా, బర్సే దేవా తన వద్ద ఉన్న రూ. 20 లక్షల పార్టీ ఫండ్‌ను స్టేట్ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులకు అప్పగించారు. ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర సరిహద్దుల్లో పోలీసులు చేపట్టిన ‘ఆపరేషన్ కగార్’ తర్వాత జరిగిన అతిపెద్ద ఆయుధ లొంగుబాటు ఇదేనని డీజీపీ వెల్లడించారు.
గెరిల్లా పోరు ఇక కష్టం: రాజిరెడ్డి
లొంగుబాటు అనంతరం మావోయిస్టు అగ్రనేత కంకణాల రాజిరెడ్డి సంచలన వ్యాఖ్య లు చేశారు. మారుతున్న కాలానికి అనుగుణం గా ఉద్యమ పంథా మారలేదని, ఆధునిక టెక్నాలజీ, డ్రోన్ నిఘా, కమ్యూనికేషన్ వ్యవస్థల ముందు సాయుధ పోరాటం చేయడం అసాధ్యంగా మారుతోందని చెప్పారు. అనారోగ్య సమస్య లు, కుటుంబ బాధ్యతలు.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పిలుపు మేరకే తను, తన భార్య లొంగిపోయామని తెలిపారు. ఇదే సమయం లో పార్టీ అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు దేవ్ జీ ఆచూకీపై స్పందిస్తూ.. దేవ్‌జీతో తను విడిపోయి చాలా కాలమైందని తెలిపారు. ఆయన ఎక్కడున్నారో, ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో తనకు తెలియదన్నారు.
కగార్ దెబ్బ.. ఎస్‌ఐబీ వ్యూహం..
మావోయిస్టులను ప్రధాన జనజీవనంలో కి తీసుకురావడంలో తెలంగాణ ఎస్‌ఐబీ అత్యంత కీలక పాత్ర పోషించింది. సరిహద్దు ల్లో ఆపరేషన్ కగార్ పేరుతో భద్రతా బలగాలు మావోయిస్టులను ఉక్కిరిబిక్కిరి చేశాయి. నిరంతర కూంబింగ్, ఎన్‌కౌంటర్‌లు, సప్లై చైన్ కట్ చేయడం వంటి చర్యలతో మావోయిస్టులు తీవ్ర ఒత్తిడికి లోనయ్యారు. ఈ సమయాన్ని వినియోగించుకున్న ఎస్‌ఐబీ అధికారులు.. అగ్రనేతలతో సంప్రదింపులు జరిపి, ప్రభుత్వ పునరావాస ప్యాకేజీపై భరోసా కల్పించి లొంగుబాటుకు మార్గం సుగమం చేశారు.
అత్యంత క్లిష్టమైన ఈ ఆపరేషన్‌ను విజయవంతం చేసి, పీఎల్జీఏ చీఫ్ స్థాయి వ్యక్తి లొంగిపోయేలా చేసిన తెలంగాణ ఎస్‌ఐబీ పనితీరుపై కేంద్ర హోంశాఖ ప్రశంసల వర్షం కురిపించింది. మావోయిస్ట్ పార్టీకి వెన్నుముకగా ఉన్న మిలిటరీ దళం చీఫ్ లొంగిపోవడం తో, ఇక ఆ పార్టీ కార్యకలాపాలు దాదాపు స్తంభించిపోయినట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ ఎస్‌ఐబీని, డీజీపీ శివధర్ రెడ్డిని కేంద్ర హోంశాఖ ప్రత్యేకంగా ప్రశంసించింది. లొంగిపోయిన వారిలో పీఎల్జీఏ ఫస్ట్ బెటాలియన్ నుంచి 10 మంది, తెలంగాణ రాష్ట్ర కమిటీ నుంచి ముగ్గురు, ఎస్‌జెడ్‌బీ నుంచి ఇద్దరు, దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ దక్షిణ, పశ్చిమ బస్తర్ డీవీసీ నుంచి ఐదుగురు ఉన్నారు. వీరంతా కీలకమైన ఆపరేషన్లలో పాల్గొన్నవారే కావడం గమనార్హం.
అడవిలో మిగిలింది 17 మందే : డీజీపీ
ఈ సందర్భంగా డీజీపీ శివధర్‌రెడ్డి మావోయిస్టుల బలాబలాలపై కీలక గణాంకాలను బయటపెట్టారు. ‘పీఎల్జీఏ బెటాలియన్ పూర్తిగా కుప్పకూలింది. ఒకప్పుడు అన్ని ర్యాంకులతో కలిపి 400 మందికిపైగా ఉన్న బెటాలియన్‌లో ఇప్పుడు కేవలం 66 మంది మాత్రమే మిగిలారు. కంకణాల రాజిరెడ్డి లొంగుబాటుతో తెలంగాణ స్టేట్ కమిటీ దాదాపు ఖాళీ అయింది. ప్రస్తుతం స్టేట్ కమిటీలో ఒక్కరు మాత్రమే ఉన్నారు. మావోయిస్టు పార్టీలో తెలంగాణకు చెందినవారు ఇంకా 55 మంది ఉన్నారని మేము భావించాం. కానీ, తాజా సమాచారం ప్రకారం ఆ సం ఖ్య కేవలం 17 మాత్రమే.
లొంగిపోయిన వారినుంచి రూ. ౨౦లక్షల నగదును స్వాధీ నం చేసుకున్నాం. హెలికాప్టర్లను కూల్చేందుకు వాడే సామాగ్రి కూడా స్వాధీనం చేసుకున్నాం.దేవా.. హిడ్మా సొంత గ్రామానికి చెందినవాడు. ఆయనపై రూ. ౭౫ లక్షల రివార్డు ఉంది. పెద్దపల్లి జిల్లా కిష్టంపేట్‌కు చెందిన రాజిరెడ్డి లొంగుబాటుతో ఇంకా రాష్ట్రానికి చెందిన ఒక్కరు మాత్రమే మావోయిస్టు పార్టీ స్టేట్ కమిటీలో ఉన్నా రు’. అని డీజీపీ వివరించారు. ఆదివారం మరో 20 మంది వరకు మావోయిస్టులు లొంగిపోయే అవకాశం ఉందని పోలీసువర్గాల సమాచారం.