calender_icon.png 26 August, 2025 | 7:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దివ్యాంగులకు స్మితా సబర్వాల్ క్షమాపణ చెప్పాలి

25-07-2024 12:05:00 AM

  • దివ్యాంగుల డిమాండ్, నిరసనలు 
  • స్మిత ఫ్లెక్సీకి ఎర్రటి నీళ్లతో అభిషేకం

హైదరాబాద్ సిటీబ్యూరో/ఆదిలాబాద్ (విజయక్రాంతి)/ముషీరాబాద్, జూలై 24: దివ్యాంగులను కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ దివ్యాంగులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని తెలంగాణ దివ్యాంగుల సంఘాల జేఏసీ కన్వీనర్ నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. ఆమెపై వివిధ చట్టాల ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బుధవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దివ్యాంగులను అవమానపర్చేలా, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్, ఐఏఎస్ అధికారుల సంఘం, అన్ని రాజకీయ పార్టీలు స్పందించాలని కోఆరు.

సమావేశంలో అఖిల భారత దివ్యాంగుల ఐక్య వేదిక అధ్యక్షుడు పల్లెబోయిన సుధాకర్ వర్మ, ఫ్రెండ్లీ ఎన్విరాన్ మెంట్ ఫర్ ది డిజెబుల్ చైర్మన్ గంగారాం, దివ్యాంగుల న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కొమురయ్య తదితరులు పాల్గొన్నారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కేబీ శ్రీధర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో దివ్యాంగుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.

స్మిత సబర్వాల్‌కు అహంకారమని, అందుకే దివ్యాంగులను అశక్తులుగా చిత్రీకరించే విధంగా పోస్ట్ చేసిందని దివ్యాంగుల సంఘాల నాయకులు విజయలక్ష్మి, శ్రీనివాస్ మండిపడ్డారు. ఆదిలాబాద్‌లో హ్యాండీ క్యాప్ హెల్పింగ్ వెల్ఫేర్ సొసైటీ ఆధర్యంలో దివ్యాంగులు స్మితా ఫ్లెక్సీపై ఎర్రటి రంగు నీళ్లు పోసి నిరసన తెలిపారు. కార్యక్రమంలో సొసైటీ ఫౌండర్ ప్రెసిడెంట్ మహమ్మద్ ఇమ్రాన్ పాల్గొన్నారు.