calender_icon.png 8 October, 2025 | 7:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏటీసీల ద్వారా సాంకేతిక వృత్తి విద్య

08-10-2025 05:30:53 PM

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్..

మందమర్రి (విజయక్రాంతి): ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ల ద్వారా విద్యార్థులకు అధునాతన సాంకేతిక వృత్తి విద్యను అందిస్తుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్(District Collector Kumar Deepak) అన్నారు. బుధవారం పట్టణంలోని అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ ను ఆకస్మికంగా సందర్శించి రిజిస్టర్లు, పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రస్తుత పోటీ ప్రపంచానికి అనుగుణంగా ఏటీసీలలో వృత్తి విద్య కోర్సులను అందించడం జరుగుతుందన్నారు. అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న సాంకేతిక వృత్తి విద్య కోర్సులను సద్వినియోగం చేసుకొని అభ్యర్థులు స్వయం ఉపాధి పొందాలని కోరారు.

స్థానిక ఎన్నికల ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్...

మండల కేంద్రంలోని మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయాన్ని సందర్శించి 2వ సాధారణ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 9వ తేదీ నుండి చేపట్టనున్న నామినేషన్ల స్వీకరణ, ఇతర ఏర్పాట్లను పరిశీలించారు. మండల, జిల్లా ప్రజా పరిషత్ ఎన్నికలను 2 విడతలలో నిర్వహించడం జరుగు తుందని, జిల్లాలో 16 జెడ్పిటిసి, 129 ఎంపిటిసి స్థానాలకు ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. ఈ నెల 9వ తేదీ ఉదయం 10.30 గంటల నుండి 11వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు మొదటి విడత ఎన్నికలకు నామినేషన్లు స్వీకరించడం జరుగుతుందని, 12వ తేదీన నామినేషన్ల పరిశీలన, చెల్లుబాటయ్యే నామినేటెడ్ అభ్యర్థుల జాబితా, 13వ తేదీన అప్పీళ్ళ స్వీకరణ, 14వ తేదీన అప్పీళ్ళ పరిష్కరణ, 15వ తేదీన మధ్యాహ్నం 3 గంటల వరకు అభ్యర్థిత్వం ఆ ఉపసంహరణ, 3 గంటల తరువాత పోటీ చేయు అభ్యర్థుల జాబితా ప్రచురణ, 23వ తేదీన పోలింగ్, నవంబర్ 11వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతాయని తెలిపారు. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియలో నిబంధనలను పాటించాలని, రిటర్నింగ్ అధికారులు నామినేషన్ ఫారములు, రిజిస్టర్లు సక్రమంగా నిర్వహించాలని సూచించారు.

ప్రచారానికి సంబంధించిన అనుమతులు నిబంధనలకు లోబడి నిర్ణీత గడువులోగా జారీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. సిసి కెమెరాలు, గోడ గడియారాలు, ఓటర్ల జాబితా నిర్వహణ సక్రమంగా ఉండాలని, నామినేషన్ల సమయంలో వీడియోగ్రఫీ ఖచ్చితంగా ఉండాలన్నారు. నామినేషన్ సమయంలో అభ్యర్థులు సమర్పించవలసిన అపిడవిట్లు, ధ్రువపత్రాలు, ఇతర ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. జిల్లాలో జరగనున్న ఎన్నికలలో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా సమర్ధవంతంగా నిర్వహించాలని, నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తూ ఎన్నికలు సజావుగా జరిగేలా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఐటిఐ కళాశాల ప్రిన్సిపాల్ దేవానంద్, ఎంపిడిఓ కార్యాలయం అధికారులు పాల్గొన్నారు.