08-10-2025 05:46:16 PM
దౌల్తాబాద్: అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తూ పేదప్రజల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని మాజీ ఎంపీపీ దార సత్యనారాయణ పేర్కొన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి పనులకు పెద్దపీట వేస్తూ రాష్ట్రాభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. పదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసిందని, ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని విమర్శించారు.
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ బాకీ కార్డు పేరుతో విషప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కులగణనలో పాల్గొనని బీఆర్ఎస్, బీజేపీ నేతలకు బీసీ రిజర్వేషన్ల గురించి మాట్లాడే అర్హత లేదని ఘాటుగా విమర్శించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీదే ఘనవిజయం సాధిస్తుందనే ధీమా వ్యక్తం చేశారు. ఆయనతో పాటు సీనియర్ నాయకులు కర్నాల శ్రీనివాస రావు, మాజీ మండల అధ్యక్షుడు దశరథ్ రెడ్డి, భద్రయ్య, ఆది బాలకృష్ణ, దుద్దెడ స్వామి, యాదగిరి, యేసు, స్వామి తదితరులున్నారు.