24-01-2026 08:25:09 PM
జిల్లా కలెక్టర్ కె.హరిత
కాగజ్‌నగర్,(విజయక్రాంతి): విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో ఉపాధ్యాయులు బోధన చేయాలని జిల్లా కలెక్టర్ కె. హరిత సూచించారు. శనివారం మండలంలోని గన్నారం గ్రామంలో ఉన్న తెలంగాణ జ్యోతిబా పూలే బాలికల గురుకుల పాఠశాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మెనూ పట్టిక, విద్యార్థినులకు అందిస్తున్న భోజనం నాణ్యత, ఆహారం తయారీలో వినియోగిస్తున్న కూరగాయలు, నిత్యావసర సరుకుల నాణ్యతను పరిశీలించారు.
పాఠశాల ప్రిన్సిపాల్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వంటశాలను పరిశుభ్రంగా ఉంచాలని, ఆహారం తయారీ సమయంలో సిబ్బంది శుభ్రత నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. మూత్రశాలలు, మరుగుదొడ్లు శుభ్రంగా ఉండేలా పర్యవేక్షించాలని, పాఠశాల పరిసరాల్లో పరిశుభ్రత నిర్వహణను పకడ్బందీగా చేపట్టాలని తెలిపారు. తరగతి గదులను సందర్శించి బోధన విధానం, మెనూ ప్రకారం భోజనం అమలవుతున్న తీరును విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.
ఉపాధ్యాయులు విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే విధంగా బోధన చేయాలని, 10వ తరగతి విద్యార్థులను వార్షిక పరీక్షలకు సన్నద్ధం చేయాలని సూచించారు. సబ్జెక్టుల వారీగా వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని, గైర్హాజరు లేకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని పేర్కొన్నారు.విద్యార్థులకు అందించాల్సిన పండ్లు సరఫరా కావడంలేదా అని ప్రిన్సిపల్ ని ప్రశ్నించగా సంబంధిత గుత్తేదారు సరఫరా చేయడం లేదని తెలియజేశారు.
దీనిపై జిల్లా కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ, విద్యార్థులకు సకాలంలో నాణ్యమైన పండ్లను సరఫరా చేయాలని, సంబంధిత సమాచారాన్ని తనకు అందించాలని ఆదేశించారు. గురుకుల పాఠశాలకు ప్రహరీ గోడ నిర్మాణానికి సంబంధించి ఇంజనీరింగ్ అధికారులతో అంచనా ప్రతిపాదనలు సిద్ధం చేసి, ప్రహరీ గోడ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి లక్ష్మీనారాయణ, పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.