24-01-2026 08:21:19 PM
తాండూరు,(విజయక్రాంతి): గ్రామాలను అభివృద్ధి చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం అని వికారాబాద్ జిల్లా తాండూర్ శాసనసభ్యులు మనోహర్ రెడ్డి అన్నారు. శనివారం ఆయన పెద్దముల్ మండలం గోట్లపల్లి గ్రామంలో నూతన పంచాయతీ భవనాన్ని ప్రారంభించి, డ్వాక్రా భవన నిర్మాణం కోసం శంకుస్థాపనలు చేశారు. అనంతరం గ్రామ సర్పంచ్ సలాం అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ... గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో గ్రామ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు నూతన పంచాయతీ భవనంతో పాటు డ్వాక్రా భవన నిర్మాణం కోసం నిధులు మంజూరు చేశామని అన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మహిళలకు అన్ని రంగాల్లో పెద్దపీట వేస్తున్నామని వారి అభివృద్ధి సంక్షేమం కోసం ఎన్ని నిధులు ఖర్చయినా కూడా వెనకడుగు వేయకుండా నిధులు మంజూరు చేస్తామన్నారు. డ్వాక్రా సంఘాల ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు నిర్వహించడంతో ఆ సంఘాలు బలోపేతం అవుతున్నాయని.. రేషన్ కార్డు లేని వారికి రేషన్ కార్డులు మంజూరు చేసి సన్న బియ్యం అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో కోటిపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అంజయ్య , ఉప సర్పంచ్ చంద్రయ్య , మహిళా సమాఖ్య అధ్యక్షురాలు శారద కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు .