18-10-2025 12:06:05 AM
ఎస్పీ డాక్టర్ శబరీష్
ములుగు, అక్టోబరు 17 (విజయక్రాంతి): శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా, ఎటువంటి అవాంఛనీయ నేర సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలుగా ములుగు జిల్లా పోలీస్ విభాగం ప్రత్యేక నిఘా చర్యలను చేపట్టింది. తెలంగాణ రాష్ట్ర డీజీపీ బి.శివధర్ రెడ్డి,ఆదేశాల మేరకు, ములుగు జిల్లా పరిధిలో ఉన్న రౌడీ షీటర్లు మరియు సస్పెక్ట్ షీటర్లకు ప్రతి నెలా క్రమం తప్ప కుండా ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించాలని, వారి కదలికలపై నిఘా ఉంచాలని ములు గు జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ పి. జిల్లా పోలీస్ అధికారులను ఆదేశించారు.
ఎస్పీ ఆదేశాల ప్రకారం, ముందస్తు చర్యలలో భాగంగా ములుగు జిల్లా పోలీస్ అధికా రులు మొత్తం 69రౌడీ షీటర్లు మరియు 128సస్పెక్ట్ షీటర్లకు ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించి, వారి కదలికలపై మరింత నిఘా పెంచారు. ఈ సందర్భంగా ఏవైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన మైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రౌడీ షీటర్లు మరియు సస్పెక్ట్ షీటర్లను హెచ్చరించారు.
ఈసందర్భంగా ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ మాట్లాడుతూ గత సంవత్సర కాలంగా సత్ప్రవర్తన కలిగి ఉన్న 20మందిపై రౌడీషీట్ మరియు 53మందిపై సస్పెక్ట్ షీట్ లు మొత్తంగా 73 మందిపై షీట్ లు ఎత్తివేసినట్లు ఈ సందర్భంగా తెలియజేశారు. ములుగు ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణ కోసం ములుగు పోలీస్ ఎల్లప్పుడూ కట్టుబడి కృషి చేస్తుందని తెలిపారు.