13-12-2025 12:00:00 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, డిసెంబర్ 12 (విజయక్రాంతి): నిరంతరం పని ఒత్తిడిలో ఉండే పోలీసు సిబ్బంది శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడేందుకు పోలీస్ శాఖ కీలక ముందడుగు వేసింది. బంజారాహిల్స్‌లోని స్టేట్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ , కంట్రోల్ సెంటర్‌లో అత్యాధునిక హంగులతో కూడిన ఫిట్‌నెస్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాన్ని శుక్రవారం రాష్ర్ట డీజీపీ బి. శివధర్‌రెడ్డి ఘనంగా ప్రారంభించారు. సుమా రు 1900 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ఫిట్‌నెస్ సెంటర్‌ను తీర్చిదిద్దారు.
ఇందులో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన కార్డి యో, స్ట్రెంత్ ట్రైనింగ్ పరికరాలను అందుబాటులో ఉంచారు. ట్రెడ్మిల్స్, లాట్ పుల్ -డౌన్ మెషీన్లు, మల్టీఫంక్షనల్ వి-షేప్ ట్రైనర్లు, వర్టికల్ చెస్ట్-ప్రెస్ యూనిట్లు, ఒలింపిక్ బెంచ్లతో పాటు టేబుల్ టెన్నిస్ సౌకర్యం కూడా కల్పించారు. గైడెడ్ వర్క్ అవుట్ జోన్ల ద్వారా సిబ్బందికి శాస్త్రీయ పద్ధతిలో శిక్షణ ఇవ్వనున్నారు.
హైదరాబాద్ సిటీ పోలీస్, సైబర్ సెక్యూరిటీ బ్యూరో, ఈగల్ ఫోర్స్ యాంటీ నార్కోటిక్ బ్యూరో, కమాండ్ కంట్రోల్ సెంటర్వంటి అత్యంత కీలకమైన, టెక్నాలజీ ఆధారిత విభాగాల్లో పనిచేసే సిబ్బందికి ఈ జిమ్ ఎంతగానో ఉపయోగపడనుంది. వారిలో పని సామర్థ్యాన్ని పెం చడానికి, ఆరోగ్యాన్ని కాపాడటానికి ఇది దోహదపడుతుందని డీజీపీ తెలిపారు.
సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్న టీజీఐసీసీసీ నాయకత్వాన్ని ఆయన అభినందించారు. కార్యక్రమంలో టీజీసీఎస్బీ డైరెక్టర్ శిఖా గోెుల్, హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్, టీజీఐసీసీసీ డైరెక్టర్ వీబీ కమలాసన్‌రెడ్డి, సైబరాబాద్ సీపీ అవినాష్ మహం తి, ఈగల్ ఫోర్స్ డీఐజీ అభిషేక్ మహంతి, ఎస్పీ పుష్ప తదితరులు పాల్గొన్నారు.