calender_icon.png 5 November, 2025 | 3:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్పెషల్ లోక్ అదాలత్ టీఎస్‌సీజే మానస పుత్రిక

05-11-2025 12:51:54 AM

నిజామాబాద్ లీగల్ కరేస్పాండెంట్ నవంబర్ 4 (విజయ క్రాంతి): స్పెషల్ లోక్ అదాలత్ తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆపరేష్ కుమార్ సింగ్ మానస పుత్రిక అని నిజామాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవ అధికార సంస్థ చైర్ పర్సన్ జి. వి. ఎన్ భారత లక్ష్మీ తెలిపారు.జస్టిస్ ఆపరేష్ కుమార్ సింగ్ ఆలోచధార నుండి ఉద్భవించినదే స్పెషల్ లోక్ అదాలత్ అని ఆమె వివరించారు.

న్యాయస్తానాలలో పెండింగ్ లో ఉన్న కొన్నాయినైన కేసులను రాజీపద్ధతిన పరిష్కరించి దిగువ కోర్టులపై ఉన్న పనిబారాన్ని తగ్గించాలనే తాపత్రయమే జస్టిస్ ఆపరేష్ లో ఉన్నదని ఆమె పేర్కొన్నారు.జిల్లాకోర్టు ప్రాంగణంలోని నిజామాబాద్ బార్ అసోసియేషన్ హల్ లో ఆమె న్యాయవాదుల సమావేశంలో ప్రసంగించారు. నవంబర్ 15న జిల్లా వ్యాప్తంగా నిర్వహించనున్న ప్రత్యేక లోక్ అదాలత్ విజయవంతం చేయడంలో న్యాయవాదుల సహకారం చాలా అవసరమని అన్నారు.

రాజీ పడదగిన చిన్న చిన్న కేసులు చీమల పుట్టల్ల పేరుకుపోవడం వలన ఎలాంటి ప్రయోజనం లేదని వాటిని లోక్ అదాలత్ పరిష్కరించడమే మేలని తెలిపారు. ప్రధానమైన, అతిముఖ్యమైన కేసుల న్యాయ విచారణపై న్యాయధికారులు దృష్టి కేంద్రీకరించడం వీలవుతుందని ఆమె అన్నారు.కుటుంబ తగాదాలు, సివిల్ వివాదాలు, చెక్ బౌన్స్ కేసులు రాజీకి వీలు ఉన్నవేనని అన్నారు.న్యాయవాదుల ప్రమేయం లేకుండా కేసులను రాజీ చేయబోమని తెలిపారు.

పోలీస్ కమిషనర్ తో సంప్రదించామని క్రిమినల్ కేసులలో రాజీకి అనుకూలంగా ఉన్న వాటిని గుర్తించామని ఆమె తెలిపారు.రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ నుండి కూడా డైరెక్షన్స్ వచ్చాయని, పోలీసు శాఖ కూడా స్పెషల్ లోక్ అదాలత్ కు సంపూర్ణ సహాయ సహాకారాలు అందిస్తున్నదని అన్నారు.మోటారు రోడ్డు ప్రమాద దావాలలో రాజీ చేసుకోవడానికి భీమా కంపెనీల నుండి ఏమైనా ఇబ్బందులు ఉంటే, సదరు కంపెనీలకు ఆదేశాలు జారిచేసి లోక్ అదాలత్ మార్గం వైపు మళ్ళిస్తమని జిల్లాజడ్జి భారత లక్ష్మీ తెలిపారు.

అదనపు జిల్లాజాడ్జిలు శ్రీనివాస్, ఆశాలత లు మాట్లాడుతూ ఒక కేసు ఎన్నో రోజుల సమయాన్ని తీసుకుంటుందని, అవి రాజీకి వీలు ఉన్నవైతే ఆ దిశగా వెళ్లడమే అత్యుత్తమమని అన్నారు. స్పెషల్ లోక్ అదాలత్ విజయవంతం కావడానికి న్యాయవాదులు సహకరిస్తారని నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మామిళ్ల సాయరెడ్డి తెలిపారు. కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి సాయిసుధ, జూనియర్ సివిల్ జడ్జిలు కుష్భూ ఉపాధ్యాయ, గోపికృష్ణ, హరి కుమార్, బార్ ఉపాధ్యక్షుడు సురేష్, కోశాధికారి నారాయణ దాసు తదితరులు పాల్గొన్నారు.