calender_icon.png 5 November, 2025 | 2:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇసుక అక్రమాలకు అడ్డే లేదు..

05-11-2025 12:00:27 AM

  1. అందిన కాడికి దోచుకుంటున్న రేజింగ్ కాంట్రాక్టర్లు..

అక్రమార్కులకు అధికారుల అండ.. 

సెటిల్మెంట్లకు ప్రతిపక్ష నేత కృషి..

అక్రమాలు తెలిసిన పట్టించుకోని ఉన్నతాధికారులు..

వెంకటాపురం(నూగూరు),నవంబర్4(విజయక్రాంతి):ములుగు జిల్లా  వెంకటాపురం మండలం అక్రమ ఇసుక దందాకు అడ్డాగా ఏర్పడింది. మండల పరిధిలోని పలు రాంపులతో పాటు ఓ పట్టా భూమిలో ఇసుక తరలింపు వ్యవహారాల్లో లక్షల్లో అవకతవకలు జరిగినట్లు అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వెంకటాపురం మండలంలోని ఆలుబాక సమీపంలోని ఓ పట్టాభూమితో పాటు దాని సమీపంలోని ఓ ఇసుక సొసైటీ వ్యవహారంలో అనేక అవినీతి ఆరోపణలు వస్తున్నాయి.

ఇసుక సొసైటీ నుంచి ఇసుకను తరలించాల్సిన రేజింగ్ కాంట్రాక్టర్ తనకు అనుకూలంగా ఉన్న తనకు సంబంధించిన పట్టాభూమి లోనుంచి ఇసుకను అక్రమంగా తరలించి లబ్ధిపొందే ఆలోచన చేశారని విమర్శలు వస్తున్నాయి. అక్రమ తరలింపు వ్యవహారంలో మండల స్థాయి అధికారుల నుండి జిల్లా స్థాయి అధికారులతో పాటు మీడియాకు సంబంధించిన ఓవర్గం పూర్తిగా సహకరించిందని ఆరోపణలు బలంగా ఉన్నాయి.

ఈ వ్యవహారానికి సంబంధించి ప్రతిపక్షానికి సంబంధించిన ఒకేలకు నేత అన్ని తానే స్వయంగా వ్యవహరించి ఈ వ్యవహారాన్ని బయటకు పొక్కకుండా సెటిల్మెంట్ చేసే పనికి పూనుకున్నట్లు సమాచారం. ఈ అక్రమా తరలింపు ఇసుక వ్యవహారంలో ఆ కీలక వ్యక్తి అందరిని ముందుగానే సెటిల్మెంట్ చేసుకొని అక్రమ దందాకు తెర లేపారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

అక్రమ ఇసుక తరలింపు వ్యవహారంలో ఆ వ్యక్తి సదరు రేసింగ్ కాంట్రాక్టర్ నుండి రూ. 16 లక్షలు తీసుకొని సెటిల్మెంట్ చేశారని విశ్వసనీయ సమాచారం. అక్రమ తరలింపుకు పాల్పడిన రేసింగ్ కాంట్రాక్టర్ వెంకటాపురం మండలంలో సుమారు ఐదు సొసైటీల్లో తన వాటాను కలిగి ఉండి అక్రమ దందాకు పాల్పడుతున్నట్లు తెలిసింది. ముందుగానే అధికారులందరితో ఒప్పందం చేసుకున్న కారణంగా తనకేమీ జరగదని అభిప్రాయంతో అధికార పార్టీ అండతో ఈ ఇసుక అక్రమ దందాకు పాల్పడ్డారని పలువురు విమర్శిస్తున్నారు.

ఆలుబాక సమీపంలోని ఈ ఇసుక సొసైటీలో సుమారు 20వేల క్యూబిక్ మీటర్లు ఇంకా తరలించాల్సి ఉండగా అక్కడ తవ్వకాలు చేపట్టకుండా ఆ ప్రాంతానికి సమీపంలోని గోదావరిలో ఉన్న పట్టాభూమి సమీపంలో రూ. కోటి రూపాయలకు పైగానే ఇసుకను అక్రమంగా తరలించారనే ఆరోపణలు ఉన్నాయి.

అడ్డగోలుగా, యదేచ్ఛగా వందలాది లారీలను అక్రమంగా తరలిస్తున్నా కనీసం వాటిని ఆపి తనిఖీ చేయడంగానీ ర్యాంపు వద్దకు వెళ్లి రెవెన్యూ ,టీఎస్‌ఎండీసీ అధికారులు పరిశీలించడం గాని చేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. అక్రమ తరలింపు వ్యవహారంలో ఇకనైనా జిల్లా కలెక్టర్ స్పందించి టీజీఎండిసి అధికారుల పై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని, అక్రమ ఇసుక దందాకు పాల్పడిన రేజింగ్ కాంట్రాక్టర్ ను శిక్షించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.