05-11-2025 12:04:17 AM
-ఆగని పనులు.. అక్రమ నిర్మాణాలు
-చర్యలు తీసుకోని జీహెచ్‌ఎంసీ అధికారులు
-అక్రమ నిర్మాణాలకు పూర్తిస్థాయిలో అండదండలు
-నియోజకవర్గంలో పుట్టగొడుగులా అక్రమ నిర్మాణాలు
ఎల్బీనగర్, నవంబర్ 4 : ఎల్బీనగర్ నియోజకవర్గంలో జీహెచ్‌ఎంసీ అధికారులు ఇచ్చిన నోటీసులకు విలువ లేకుండా పోతుంది. టౌన్ ప్లానింగ్ అధికారులు జారీ చేసిన నోటీసులను అక్రమ నిర్మాణదారులు లెక్క చేయడం లేదు. అక్రమ నిర్మాణాలను అడ్డుకోవాల్సిన టౌన్ ప్లానింగ్ అధికారులు మొద్దు నిద్ర వీడడం లేదు. ఫలితంగా అనుమతులు లేని భవనాలు, కమర్షియల్ కాంప్లెక్స్‌లు, అపార్ట్ మెంట్లు, షెడ్ల నిర్మాణాలు పుట్టగొడుగుల మాదిరిగా నిర్మిస్తు న్నారు.
ఫిర్యాదులు వచ్చినప్పుడు మాత్రమే టౌన్ ప్లానింగ్ అధికారులు తూతూమంత్రంగా నోటీసులు ఇచ్చి చేతులు దులుపు కుంటున్నారు. అక్రమ నిర్మాణాలు అడ్డుకోవడంలో అధికారులు విఫలం కావడంతో అక్రమ నిర్మాణాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. దీని వెనుక ముడుపుల ముట్టాయనే ముచ్చట ఉందనే ప్రచారం స్థానికంగా జరుగుతుంది. అందుకే అధికారులు అక్రమ నిర్మాణాలను క్షేత్రస్థాయిలో నిలువరించలేకపోతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
నోటీసులు ఇచ్చినా... చర్యలు శూన్యం
హయత్ నగర్, ఎల్బీనగర్, సరూర్ నగర్ సర్కిళ్ల పరిధిలో కొనసాగుతున్న నిర్మాణాల్లో అత్యధిక భాగం అనుమతులు తీసుకోకుండా ఉన్నవే అధికం. కొందరు టీఎస్ బీపాస్ లో ఒకరకమైన అనుమతులు తీసుకుని.. ఇతర నిర్మాణాలు చేపడుతున్నారు. కనీస అనుమతులు లేకుండా స్థానిక పలుకుబడితో రెసిడెన్షియల్, కమర్షియల్ షెడ్లు నిర్మిస్తున్నారు. ఎవరైనా అడిగితే? మాకు అందరూ తెలుసు... మాకు రాజకీయ బలం ఉందని దబాయిస్తున్నారు.
ఎన్నోసార్లు ఫిర్యాదు చేస్తే టౌన్ ప్లానింగ్ అధికారులు తూతూమంత్రంగా నోటీసులు ఇచ్చి, చేతులు దులుపుకుంటున్నారు. నోటీసులు ఇచ్చామని కఠిన చర్యలు తీసుకోకుం డా కాలయాపన చేస్తున్నారు. అధికారులకు చర్యలు తీసుకోకపోవడంతో అడ్డదిడ్డంగా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అధికారులకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవ డంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతుంది. ఎల్బీనగర్ నియోజకవర్గంలో అక్రమ నిర్మాణాలను టౌన్ ప్లానింగ్ అధికారులు అదనపు ఆదాయ వనరుగా మార్చు కున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. జీహెచ్‌ఎంసీ చైన్‌మెన్ల పర్యవేక్షణ లోపం, అధి కారుల నిర్లక్ష్యంతోనే అక్రమ కట్టడాలు నిరభ్యరంతరంగా కొనసాగు తున్నాయి.
ఆయా డివిజన్లలో ఆగని అక్రమ నిర్మాణాలు
1. హయత్ నగర్ డివిజన్ లో చేపట్టిన అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదులు రావడంతో టౌన్‌ప్లానింగ్ అధికారులు నోటీ సులు ఇచ్చారు. అయినా, నిర్మాణ దారులు నోటీసులను లెక్క చేయకుండా పనులు చేపడుతున్నారు. పాత హయత్ నగర్ రోడ్డు, డిఫెన్స్ కాలనీ రోడ్డులో నోటీసులు ఇచ్చినా కొనసాగుతున్న నిర్మాణాలు.
2. మన్సూరాబాద్ డివిజన్ లోని సహారా రోడ్డులో చేపట్టిన షెడ్ల నిర్మాణదారులు సైతం నోటీసులు వచ్చినా పనులు జరుగుతున్నాయి.
3. నాగోల్ డివిజన్ పరిధిలోని ఇటీవల శ్రీసాయి నారాయణ కాలనీ, రోడ్ నెంబర్2 లో ఉన్న పార్కులో అక్రమ నిర్మాణాన్ని టీపీఎస్ సోమశేఖర్ ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు సాయంతో నిర్మాణం కూల్చివేశారు.
4. హస్తినాపురం డివిజన్ పరిధిలోని జడ్పీ రోడ్డులో అనేక సంఖ్యలో అక్రమ కమర్షియల్ షెడ్లు ఉన్నాయి. ఇటీవల అధికారులు నోటీసులు ఇవ్వడానికి వస్తే యజమానులు లేరు. దీంతో పనులను నిలిపివేశారు. ఐదు రోజుల తర్వాత యధావిధిగా నిర్మాణ పనులు జరుగుతున్నాయి.
అధికారుల హెచ్చరికలు బేఖాతరు
ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తప్పవని, నిర్మాణాలను కూల్చి వేస్తామని జీహెచ్‌ఎంసీ సర్కిల్ -3 అసిస్టెంట్ ప్లానర్ లక్ష్మీ అన్నారు. నాగోల్ డివిజన్ లోని శ్రీ సాయి నారాయణ కాలనీ రోడ్ నెంబర్2 లో ఉన్న పార్కులో అక్రమంగా చేపట్టిన నిర్మాణాన్ని కూల్చివేత సందర్భంగా నిర్మాణదారులకు టీపీఎస్ సోమశేఖర్ పలు హెచ్చరికలు చేశారు. ప్రతి నిర్మాణానికి అవసరమైన అనుమతులు తీసుకోవాలని సూచించారు. లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. అయితే, ఎల్బీనగర్ నియోజకవర్గంలోని మూడు సర్కిళ్ల పరిధిలో అధికారులు ఇచ్చిన నోటీసులను లెక్క చేయకుండా నిర్మాణదారులు పనులను కొనసాగిస్తున్నారు.