14-10-2025 08:22:37 PM
గద్వాల (విజయక్రాంతి): బెస్ట్ అవైలబుల్ పాఠశాలలలో చదువుతున్న విద్యార్థుల సంక్షేమంపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ప్రణాళిక, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క(Minister Bhatti Vikramarka) అన్నారు. మంగళవారం హైదరాబాద్ నుండి రాష్ట్ర సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల సంక్షేమ శాఖల అధికారులతో బెస్ట్ అవైలబుల్ పాఠశాలలలో చదివే షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్ తెగల విద్యార్థుల సంక్షేమంపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో బెస్ట్ అవైలబుల్ పాఠశాలల పథకం క్రింద ఎంపిక చేసిన పాఠశాలల్లో చదివే షెడ్యూల్డ్ కులములు, షెడ్యూల్ తెగలకు చెందిన విద్యార్థుల సంక్షేమంపై ఆయా జిల్లాల కలెక్టర్లు నిరంతరం పర్యవేక్షించాలని, విద్యార్థులకు అందిస్తున్న బోధన, ఆరోగ్యం, మెనూ ప్రకారం భోజనం, ఇతర మౌలిక వసతుల అమలుపై పాఠశాలలను సందర్శించి పరిశీలించాలని తెలిపారు.
ఎంపికైన ప్రతి విద్యార్థి పాఠశాలలో ఉండాలని, సమస్యల పరిష్కారంపై ఆయా పాఠశాలల యాజమాన్యాలతో చర్చించి తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు. విద్యా సంవత్సరంలో విద్యార్థులకు ఎలాంటి ఆటంకం లేకుండా విద్యాబోధన కొనసాగించాలని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్ సంబంధిత అధికారులతో మాట్లాడుతూ, జిల్లాలోని బెస్ట్ అవైలబుల్ పాఠశాలల్లో విద్య అభ్యసిస్తున్న విద్యార్థుల సంక్షేమంపై సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. విద్యా బోధన, విద్యార్థుల ఆరోగ్యంపై నిరంతరం పర్యవేక్షించాలని, ఆయా పాఠశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని, సమస్యలు ఉంటే తనకు తెలియజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ నర్సింగరావు, సంబంధిత సంక్షేమ శాఖల అధికారులు పాల్గొన్నారు.