calender_icon.png 1 November, 2025 | 10:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలీసుల ప్రత్యేక నిఘా

01-11-2025 12:00:00 AM

  1. పోలీసులు ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి 

సైబర్ నేరాల పట్ల చైతన్యం కలిగించాలి 

గంజాయి నియంత్రణలో కఠినంగా  వ్యవహరించాలి

అత్యధికంగా గరిడేపల్లి మండల కేంద్రంలో 57 సీసీ కెమెరాలు ఏర్పాటు:  ఎస్పీ నర్సింహ 

గరిడేపల్లి, అక్టోబర్ 31 : జిల్లా వ్యాప్తంగా నేరస్తులపై, నేర చరిత్ర కలిగిన వ్యక్తులపై,చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న వారిపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు జిల్లా ఎస్పీ నరసింహ తెలిపారు.గరిడేపల్లి పోలీస్ స్టేషన్ ను ఎస్పీ నరసింహ శుక్రవారం సందర్శించారు. పోలీస్ స్టేషన్ ఆవరణను, పరిసర ప్రాంతాలను ఆయన పరిశీలించారు. ఈ సంద ర్భంగా విలేకరులతో మాట్లాడుతూ సూర్యాపేట జిల్లాలో హుజూర్నగర్ నియోజకవర్గం పూర్తి వ్యవసాయ ఆధారిత ప్రాంతమని ఇక్కడ ప్రజలందరూ వ్యవసాయం చేసుకొని జీవించడం జరుగుతుందని తెలిపారు.

వ్యవసాయ ఆధారిత ప్రాంత ప్రజల కోసం పోలీస్ సర్వీస్ మెరుగైన రీతిలో అందించాలని తెలిపారు.ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనాలు,రోడ్డు ప్రమాదాలు,దోపిడీలు, గంజాయి సైబర్ నేరాలు జరుగుతుంటాయని తెలిపారు. వీటిని కట్టడి చేస్తూ ఆయా ప్రాంతాల ప్రజలకు పోలీసులు సరైన సేవలను అందించాలని కోరారు.జిల్లా పరిధిలో గత ఏడాదితో పోలిస్తే గరిడేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నేరాల సంఖ్య అదుపులో ఉందని తెలిపారు.

రోడ్డు ప్రమాదాల నియంత్రణలో దొంగతనాలను అరికట్టడంలో ఘర్షణలను తగ్గించడంలో గరిడేపల్లి పోలీస్ స్టేషన్ కొంతమేరకు ముందంజలో ఉందని తెలిపారు. సైబర్ నేరాలపై, గంజాయి నివారణపై ప్రజల్లో చైతన్యాన్ని పెంపొందించేందుకు కృషి చేయాలని కోరారు. జిల్లా వ్యాప్తంగా దీనికోసం ప్రజా భరోసా కార్యక్రమాన్ని అమలు చేస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేసేందుకు వచ్చిన బాధితులను గౌరవించాలని ఫిర్యాదు పై వెంటనే స్పందించాలని ఆయన ఆదేశించారు.

కొన్ని విషయాలలో ఫిర్యాదులు అందిన వెంటనే స్పందించి బాధితులకు సత్వర న్యాయం చేసే విధంగా పోలీస్ యంత్రాంగం కృషి చేయాలని కోరారు. జిల్లా వ్యాప్తంగా నేరాల సంఖ్యను గణనీయంగా తగ్గించేందుకు తప్పు చేసిన వారు తప్పించుకోకుండా ఉండేందుకు,  తప్పు చేసేందుకే నెరగాళ్లు భయపడే విధంగా ప్రత్యేక నిఘా పెట్టినట్లు ఆయన తెలిపారు.

రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ప్రత్యేకమైన చర్యలను తీసుకుం టున్నట్లు తెలిపారు. దీనికోసం ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను గుర్తించి అక్కడ వేగం నియంత్రణ కోసం ప్రమాదాల నివారణ కోసం భారీకేళ్ళను, జిగ్ జిగ్ జాగ్ లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దీనిలో భాగంగా గరిడేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మూడు ప్రమాదాల జరుగుతున్న ప్రాంతాలను గుర్తించి భారీకేళ్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

దీంతోపాటు నేరాల నియంత్రణ కోసం జిల్లా వ్యాప్తంగా సీసీ కెమెరాలు పటిష్టంగా ఏర్పాటు చేసేందుకు కృషి జరుగుతుందని తెలిపారు. హుజూర్నగర్ నియోజకవర్గం లో 150 సిసి కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గ మొత్తంలోనే అత్యధికంగా గరిడేపల్లిలో 57 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడమే కాక వాటి పర్యవేక్షణకు, నిరంతరం పనిచేసే విధంగా ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఏర్పాటుచేసిన సీసీ కెమెరాలు ఒక పోలీస్ స్టేషన్ పరిధిలోనే కాకుండా ఆ సీసీ కెమెరాలు జిల్లా ఎస్పీ కార్యాలయంతో పాటు రాష్ట్ర డిజిపి కార్యాలయం కూడా మానిటరింగ్ చేస్తుందని తప్పు చేసిన వారు నేరాలకు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవాళ్లు ఎట్టి పరిస్థితిలో తప్పించుకునే పరిస్థితి ఉండదని ఆయన వివరించారు.

ప్రతిరోజు సీసీ కెమెరాలు మానిటరింగ్ చేస్తామని తద్వారా ప్రజలకు పోలీసులు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. మొదట పోలీస్ స్టేషన్లో పోలీసులు నిర్వహించిన పరేడ్ పరేడ్ ఆయన తిలకించారు. పోలీస్ స్టేషన్లో నూతనంగా నిర్మించిన రిసెప్షన్ గదిని ఆయన ప్రారంభించారు.

అనంతరం పోలీస్ స్టేషన్ లో ఏర్పాటుచేసిన వివిధ రకాల వస్తువులను, లాకప్ గదిని, పోలీస్ స్టేషన్ పరిసరాలను, రికార్డులను ఆయన పరిశీలించారు. కార్యక్రమంలో హుజూర్నగర్ సిఐ చరమందరాజు, గరిడేపల్లి, స్పెషల్ బ్రాంచ్ సిఐ రామారావు, డిసిఆర్బి ఇన్స్పెక్టర్ హరిబాబు, గరిడేపల్లి ఎస్‌ఐ చలికంటి నరేష్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.