calender_icon.png 8 May, 2025 | 6:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావాలని ప్రత్యేక పూజలు..

07-05-2025 05:20:23 PM

హుజురాబాద్ (విజయక్రాంతి): ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావాలని బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం పరిధిలోని ఇల్లంతకుంట మండల కేంద్రంలో శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు కృష్ణారెడ్డికి ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు నిర్వహించి చిత్రపటాన్ని అందజేశారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాశ్మీర్ పహల్గామ్ లో జరిగిన పాక్ ఉగ్రవాద దాడులతో అమాయక భారత ప్రజలను చంపిన పాకిస్థాన్ ఉగ్రవాద స్థావరాలను రాత్రి ఆపరేషన్ సింధూర్ పేరుతో ధ్వంసం చేసిన భారతదేశ ఆర్మీ సైన్యానికి, మనదేశ ప్రజలకు ఏలాంటి నష్టం వాటిల్లకుండా ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావాలని సీతారామచంద్రస్వామి వారిని కోరుకున్నట్లు తెలిపారు. కాశ్మీర్ లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత మోడీ పాకిస్థాన్ ఉగ్రవాద స్థావరాలను గుర్తించి వాటిని నిర్మూలించడానికి భారత త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారన్నారు. నిన్న రాత్రి ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్థాన్ లోని 9 ఉగ్రవాద సంస్థల కార్యాలయాలను నేలమట్టం చేశారని, ఇప్పుడు నరేంద్ర మోడీ  ప్రభుత్వం గత ప్రభుత్వాల మాదిరిగా కాకుండా అన్ని అస్త్రాలు ప్రయోగిస్తూ పాకిస్థాన్ దేశాన్ని అష్ట దిగ్బంధం చేశారన్నారు.

ఇప్పటికైనా పాక్ తన తీరు మార్చుకొని ఉగ్రవాద సంస్థలను నిర్మూలించడానికి చర్యలు తీసుకోవాలని లేకుంటే మోడీ ప్రభుత్వం పాకిస్థాన్ తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. భారతీయులందరూ భారత సైన్యానికి పూర్తి మద్దతు తెలపాలని, ఐక్యంగా ఉండి యుద్దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఇల్లందకుంట మండల అధ్యక్షులు బైరెడ్డి రమణారెడ్డి, జమ్మికుంట పట్టణ అధ్యక్షులు కొలకాని రాజు, మాజీ సర్పంచ్ సురేందర్ రెడ్డి, జిల్లా నాయకులు ఆకుల రాజేందర్, సంపత్ రావు, గుత్తికొండ రాంబాబు, ఎండీ షపి, మురహరి గోపాల్, దేవేందర్, మేకల మురళితో పాటు తదితరులు పాల్గొన్నారు.