06-11-2025 01:10:09 AM
ఆందోళనకు దిగిన మహిళలు
బెంగుళూర్, నవంబర్5: తమిళనాడు రాష్ట్రం క్రిష్ణగిరి జిల్లాలోని మహిళల వసతి గృహ టాయిలెట్స్‌లో స్పై కెమెరాలు ఉన్న ట్లు గుర్తించారు. ఈ ప్రాంతం కర్ణాటకు సమీపంలో ఉంది. ఈ క్రమంలో మంగళవారం రాత్రి ఒక టాయిలెట్‌లో వాటిని గుర్తించిన మహిళలు ఆందోళనకు దిగారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం ఒక ప్రముఖ సంస్థ తమ ఉద్యోగుల కోసం హాస్టల్స్ నిర్వహిస్తోంది. అక్కడ వేలాది మంది మహిళలు, యువతులు ఉంటున్నారు.
ఆ వసతి గృహంలో ఉంటున్న ఒడిశాకు చెందిన ఒక మహిళా ఉద్యోగి ఈ కెమెరాలను అమర్చి ఎవరికి అనుమానం రాకుండా రహస్యంగా మహిళల వీడియోలు చిత్రీకరిస్తోంది. ఈ క్రమంలో ఆ హాస్టల్‌లోనే ఉంటున్న మరో మహిళకు ఆమె కదలికలపై అనుమానం వచ్చింది. వెంటనే హాస్టల్ నిర్వాహకుల దృష్టికి తీసుకెళ్లింది. వారు వసతి గృహం మొత్తం తనిఖీ చేయగా టాయిలెట్స్‌లో కెమెరాల ఉన్న గుట్టు బయటపడింది.
ఈ విషయం కాస్తా బయటికి పొక్కడంతో తీవ్ర కలకలం రేగింది.ఆ హాస్టల్ లో ఉంటున్న సుమారు రెండువేల మంది మహిళలు ఆందోళనకు దిగారు. హాస్టల్ మహిళలు ఇచ్చిన సమాచారంతో వసతి గృహానికి చేరుకున్న పోలీసులు నిందితురాలిని అరెస్టు చేశారు. ఈ ఘటనపై సదరు ప్రైవేటు సంస్థ నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. నిందితురాలు ఇంకా ఏమైనా వీడియోలు రికార్డు చేసిందా..? ఇందులో ఇంకెవరి ప్రమేయం ఉందనే దిశగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ ఫుటేజీని ఆమె తన స్నేహితుడికి పంపాలని ప్రణాళిక రచించినట్లు తెలుస్తోంది.