calender_icon.png 5 September, 2025 | 3:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

120 దేశాల్లో ఎస్‌ఎస్‌ఎంబీ29

04-09-2025 12:39:57 AM

మహేశ్‌బాబు, రాజమౌళి కాంబోలో భారీ బడ్జెట్‌తో ఓ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ముస్తాబవుతున్న సంగతి తెలిసిందే. ‘ఎస్‌ఎస్‌ఎంబీ29’ అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందు తున్న ఈ సినిమాపై మొదట్నుంచీ అంతర్జాతీయ స్థాయిలో సినీప్రియుల్లో ఆసక్తి నెల కొంది. ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగా ఈ చిత్రాన్ని అదే స్థాయిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు దర్శక ధీరుడు రాజమౌళి.

ఇందుకు సంబంధించి అప్‌డేట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి. ప్రస్తుతం ఈ సినిమా కెన్యాలో చిత్రీకరణ జరుపుకొంటోంది. ఈ సందర్భంగా మూవీ ఆ దేశ మంత్రి ముసాలియా ముదావాదిని మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ భేటీ ముఖ్యాంశాలను మంత్రి ముసాలియా సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకున్నారు. “రాజమౌళి రెండు దశాబ్దాలుగా ఫిల్మ్ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.

చాలా పవర్‌ఫుల్ స్టోరీలు, విజువల్స్‌ను, లోతైన సాంస్కృతిని ప్రపంచానికి తెలియజెప్పడంలో సిద్ధహస్తుడాయన. 120 మందితో కూడిన రాజమౌళి టీమ్.. తూర్పు ఆఫ్రికా అంతటా పర్యటించిన తర్వాత కెన్యాను ఎంచుకుంది. మసాయి మరా మైదానాలు.. అందమైన నైవాషా, ఐకానిక్ అంబోసెలి వంటి ప్రాంతాలు.. ఆసియాలోనే అతిపెద్ద సినిమాగా రూపొందుతున్న చిత్రంలో భాగం కానున్నాయి. ఈ సినిమాను 120 దేశాల్లో విడుదల చేసేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తోంది.

ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల మందికిపైనే చేరువయ్యే అవకాశం ఉంది. కెన్యాలో షూటింగ్ చేయడం ఒక మైల్‌స్టోన్‌గా నిలిచిపోతుంది. మా దేశ అందాలను, ఆతిథ్యాన్ని, సుందర దృశ్యాలను ప్రపంచ వేదికపై ప్రదర్శించడంలో శక్తిమంతంగా పనిచేయనుందీ సినిమా. ‘ఎస్‌ఎస్‌ఎంబీ29’తో కెన్యా తన చరిత్రను ప్రపంచంతో పంచుకోవడానికి సిద్ధంగా ఉంది. ఈ విషయంలో గర్వంగా ఉంది” అని ముసాలియా రాసుకొచ్చారు.