calender_icon.png 29 January, 2026 | 2:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్ర అభివృద్ధి బీజేపీతోనే సాధ్యం

29-01-2026 01:27:52 AM

మున్సిపల్ ఎన్నికలతో డబుల్ ఇంజిన్ సర్కారుకు రాష్ట్రంలో పునాది బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు

హైదరాబాద్, జనవరి 28 (విజయక్రాంతి): తెలంగాణను అభివద్ధి రాష్ర్టంగా మార్చగలిగేది బీజేపీ మాత్రమేనని, పిల్లల భవిష్యత్, రైతుల జీవితం, రాష్ట్ర గౌరవం కోసం బీజేపీకి మద్దతు ఇవ్వాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు కోరారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కారణంగా బీహార్, హర్యానా, మహారాష్ట్రాల్లో బీజేపీ విజయాలు సాధించిందని, వికసిత్ భారత్ లక్ష్యంతో మోదీ ప్రభుత్వం ముందుకెళ్తోందన్నారు.

మున్సిపల్ ఎన్నికల ద్వారా తెలంగాణ రాష్ర్టంలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వానికి పునాది వేస్తామని, “సేవ్ తెలంగాణ - ఫర్ బీజేపీ” నినాదంతో ప్రజలను కోరారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు సమక్షంలో పెద్దఎత్తున న్యాయవాదులు బీపేపీలో చేరారు. ఈ సందర్భంగా రాంచందర్ రావు పార్టీలో చేరిన వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.....బీజేపీలో పెద్దఎత్తున జూనియర్ న్యాయవాదులు, సీనియర్ న్యాయవాదులు, అదేవిధంగా వారి బంధుమిత్రులు బీపేజీలో చేరడం సంతోషకరమన్నారు. న్యాయ వ్యవస్థలో వేగవంతమైన అభివృద్ధిని చూసి అడ్వకేట్లు, సమాజం దీనిని స్వాగతించారని ఆయన గుర్తుచేశారు.

పెండింగ్ కేసులు పరిష్కరించడం, ఖాళీగా ఉన్న జడ్జ్ పోస్టులను వేగవంతంగా భర్తీ చేయడం మోడీ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. తెలంగాణలో దాదాపు 150 మంది యువ న్యాయవాదులు, ముఖ్యంగా సీనియర్ అడ్వకేట్లతో పాటు కేంద్ర ప్రభుత్వ స్టాండింగ్ కౌన్సిల్లో అవకాశం పొందారని తెలిపారు. వెనుకబడిన, పేద వర్గాలకు పెద్దపీట వేయడం జరిగిందన్నారు.

కమీషన్ల కాంగ్రెస్

తెలంగాణ రాష్ర్టంలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్లు ప్రారంభమయ్యాయని, బీజేపీ అన్ని సీట్లలో పోటీ చేస్తుందని  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయం సాధించడమే పార్టీ లక్ష్యమని తెలిపారు. రాష్ర్టంలో గతంలో ప్రజలు బీఆర్‌ఎస్‌కు, తరువాత కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారని, కానీ రెండు పార్టీలు రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచాయని విమర్శించారు.

మాటలకే పరిమితమైన పాలన చేశారని, రైతులు, నిరుద్యోగులు, విద్యార్థులు, మహిళలు ఏ వర్గానికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేయలేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కమీషన్ వ్యవస్థను 30 శాతానికి పెంచిందని ఆరోపించారు.

కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రుల మధ్య కలహాలు, కాంట్రాక్టర్లు, కమీషన్ వ్యవస్థ విస్తరించిందని విమర్శించారు. న్యాయవాదులు, డాక్టర్లు, ఇంజినీర్లు, ఇతర ప్రొఫెషనల్స్ బీజేపీలో చేరి మద్దతు ప్రకటించడం సంతోషకరమని అన్నారు. తెలంగాణ భవిష్యత్ కోసం మేధావులు ముందుకు రావాలని, విద్య, ఉద్యోగాలు, రైతు సంక్షేమంపై ఆలోచన చేయాలని రాంచందర్ రావు పిలుపునిచ్చారు.

గెలుపు కోసం కష్టపడాలి!

మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ విజయం కోసం అందరూ కష్టపడాలని నాయకులకు బీజేపీ ముఖ్యనేతలు దిశానిర్దేశం చేశారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు అధ్యక్షతన మున్సిపల్ ఎన్నికల మానిటరింగ్ కమిటీ సమావేశాన్ని బుధవారం నిర్వహించారు.

ఈ సమావేశంలో మహారాష్ట్ర మంత్రి, ఎన్నికల ఇన్‌చార్జ్ అశీష్ షెలార్, రాజస్థాన్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, మున్సిపల్ ఎన్నికల కోఇన్‌చార్జ్ అశోక్ పర్ణామి, తెలంగాణ రాష్ట్ర ఇన్‌చార్జ్ అభయ్‌పాటిల్, పార్టీ సంస్థాగత కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ, రాష్ట్ర ప్రధానకార్యదర్శులు, ఇతర నాయకులు పాల్గొన్నారు.