calender_icon.png 29 January, 2026 | 2:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పురపోరు అగ్నిపరీక్షే!

29-01-2026 12:57:28 AM

  1. టార్గెట్‌ను గట్టిగానే పెట్టుకున్న బీజేపీ
  2. పంచాయతీ ఎన్నికల్లో అంతంతే సీట్లు కైవసం
  3. ఇప్పుడు ఆశలన్నీ మున్సిపల్‌పైనే..
  4. రంగంలోకి దిగనున్న జాతీయ నాయకులు
  5. జిల్లాల బాధ్యతలు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు

హైదరాబాద్, జనవరి 28 (విజయక్రాంతి): ఈసారి పురపోరు బీజేపీకి ప్రతిష్టాత్మకంగా మారనుంది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అంతంత మాత్రంగానే సీట్లు దక్కించుకున్న బీజేపీకి ఈ ఎన్నికలు అగ్నిపరీక్ష కానున్నాయి. అధికారంలోని కాంగ్రెస్ పార్టీకి తామే ప్రత్యామ్నాయమని చెప్పుకునే కమలం పార్టీ ఇప్పు డు ఆశలన్నీ మున్సిపల్‌పైనే పెట్టుకుంది. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఎదగాలంటే ప్రతి ఎన్నికల్లోనూ బీజేపీ గెలవాల్సిన పరిస్థితి. ఈ ఫలితాలను బట్టే ప్రజల్లోకి పాజిటివ్ సంకేతాలు వెళ్తాయి.

మొదటి నుంచి తమకు అర్బ న్ (పట్టణ) ప్రాంతాల్లోనే బలం ఉందని చెప్పుకుంటున్న బీజేపీ ఈ ఎన్నికల్లో అత్యధికంగా కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, వార్డులను కైవసం చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో భాగంగానే వరుసగా ఎన్నికల సన్నాహక సమావేశాలను నిర్వహిస్తూ నాయకులకు ఇన్‌చార్జీలు దిశానిర్దేశం చేస్తున్నారు. ఇప్పటికే జాతీయ నాయకత్వం ముగ్గురు ఎన్నికల ఇన్‌చార్జీలు, కో ఇన్‌చార్జీలను నియమించగా త్వర లోనే జాతీయ అధ్యక్షుడితోపాటు పలువురు జాతీయ నాయకులకు ఏకంగా రంగంలోకి దింపబోతోంది.

టార్గెట్ గట్టిదే..

రాష్ట్రంలో ఏడు కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలు, 2,996 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్ ప్రక్రియకు రేపటితో ఆఖరు గడువు. అయితే గత మున్సిపల్ ఎన్నికల్లో 322 కౌన్సిలర్లు, కార్పొరేటర్లను బీజేపీ గెలుచుకుంది. వీటితోపాటు ఐదు మున్సిపల్ చైర్మన్లను బీజేపీ తమ ఖాతాలో వేసుకుంది. మొన్న జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 5000 మందిని బరిలోకి దింపి 800 నుంచి 1000 వరకు పంచాయతీలను గెలుచుకుంది.

గ్రామీణంలో తమకు పెద్దగా బలం లేదని, పట్టణమే తమ బలమని కమలం పార్టీ ముందు నుంచి అంటోంది. ప్రజల్లోనూ బీజేపీ అంటే అర్బన్ పార్టీ అనే ముద్రనే ఉంది. ఇప్పుడిదే బీజేపీకి అగ్నిపరీక్షగా మారింది. మరోవైపు కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు కూడా అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. రాజకీయ పార్టీల గుర్తుల మీద ఈ ఎన్నికలు జరుగనుండటంతో పురపోరులో ఏ పార్టీ బలమెంతో స్పష్టమవుతుంది. తమకున్న పేరును నిలుపుకోవాలన్నా...వచ్చే జీహెచ్‌ఎంసీ, అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాలన్నా ఈ ఎన్నికల్లో కచ్చితంగా విజయబావుటా ఎగురవేయాల్సిందే.

ఇందులో భాగంగానే బీజేపీ ఈసారి పెద్ద టార్గెట్‌ను పెట్టుకుంది. మొత్తం మున్సిపాలిటీల్లో 50 నుంచి 60 శాతం వరకు గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. అలాగే ఏడు కార్పొరేషన్లలో నాలుగు నుంచి ఐదు వరకు గెలుచుకునేలా వ్యూహాలను అమలు చేస్తోంది. వీటితోపాటు పార్టీ తన ఉనికిని చాటుకునేలా ఎక్కువ కార్పొరేటర్లు, కౌన్సిలర్లను గెలుచుకోవడమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది.

జాతీయ నేతలతో బహిరంగ సభలు

నూతనంగా ఎన్నికైన జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్‌తో వారం రోజుల క్రితం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు భేటీ అయ్యారు. ఢిల్లీ నుంచి ఆయన వచ్చిన వెంటనే అత్యవసరంగా పార్టీ పదాధికారుల మీటింగ్ నిర్వహించి నాయకులకు దిశానిర్దేశం చేశారు. జాతీయ నాయకత్వం ఇప్పటికే ముగ్గురిని రంగంలోకి దింపిందని, వారికి మున్సిల్ ఎన్నికల ఇన్‌చార్జ్‌లుగా నియమిస్తూ.. మహారాష్ట్ర మంత్రి ఆశిష్ శెలార్‌కు, కోఇన్‌చార్జీలుగా రేఖా శర్మ, అశోక్‌కు బాధ్యతలను అప్పగించిందని పేర్కొన్నారు.

వీరు ముఖ్యనాయకులతో వరుసగా ఎన్నికల సన్నాహాక సమావేశాలను నిర్వహిస్తూ ఎన్నికల వ్యూహాలను రచిస్తున్నారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు ఆయా జిల్లాలు, నియోజకవర్గాలు, పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ఎన్నికల టాస్క్‌లను అప్పగించారు. వీటికితోడూ ఇప్పటికే జిల్లా, మున్సిపాలిటీల వారీగా మరికొంత మంది రాష్ట్ర నేతలను ఇన్‌చార్జీలుగా రాష్ట్ర నాయకత్వం నియమించింది. రాష్ట్రవ్యాప్తంగా రెండు భారీ బహిరంగ సభలను నిర్వహించాలని పార్టీ నిర్ణయించినట్లు తెలుస్తోంది.

ఫిబ్రవరి 7, 9వ తేదీల్లో వీటిని నిర్వహించాలని ప్లాన్ చేసినట్లు తెలిసింది. ఈ సభలను ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణలో నిర్వహించాలని నిర్ణయించారు. తొలుత ఐదు సభలను నిర్వహించాలని అనుకున్న పార్టీ నేతలు దాన్ని రెండుకు కుదించినట్లుగా తెలిసింది. ఈ సభల ద్వారా ఓటర్లను ఆకర్షించేందుకు బీజేపీ జాతీయ స్థాయి దిగ్గజాలను రంగంలోకి దించుతోంది.

పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సిన్హాతో పాటు కీలక నేత అమిత్‌షా హాజరుకానున్నట్లు తెలుస్తోంది. అయితే ఎన్నికలకు చాలా తక్కువ సమయం ఉండడంతో ఎన్ని సభలు నిర్వహిస్తారో...ఎంత మంది నేతలు వస్తారనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాలంటే కమలనాథులకు ఈ పురపోరు ఎన్నికలు మాత్రం పరీక్షే అని చెప్పాలి.