29-01-2026 12:52:49 AM
హైదరాబాద్, జనవరి 28 (విజయక్రాంతి): తెలంగాణలో పార్టీ ఫిరాయింపు ల అంశం మరోసారి ఆసక్తిగా మారింది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ బుధవారం నోటీసులు జారీ చేశారు. దానం నాగేందర్‌పై అనర్హత పిటిషన్ వేసిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి కూడా స్పీకర్ నోటీసులు ఇచ్చారు. వీరిద్దరు ఈనెల 30న విచారణకు హాజరుకావాలని వేర్వేరుగా ఇచ్చిన నోటీసు ల్లో స్పీకర్ పేర్కొన్నారు.
పార్టీ మారినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న మొత్తం 10 మంది ఎమ్మె ల్యేలపై అనర్హత ఫిర్యాదులు అందగా, వారిలో అరికపూడి గాంధీ, గూడెం మహిపాల్‌రెడ్డి, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, ప్రకాష్‌గౌడ్, తెల్లం వెంకట్రావ్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, కాలే యాదయ్య పార్టీ మారలేదని స్పీకర్ క్లీన్‌చిట్ ఇచ్చారు. వీరు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలుగానే గుర్తించారు. అయితే దానం నాగేందర్, కడి యం శ్రీహరి, డాక్టర్ సంజయ్‌కి సంబంధించి స్పీకర్ ఇంకా విచారణ జరపలేదు. ఇప్పుడు తాజాగా ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు.
స్పీకర్ నోటీసు ఇచ్చిన గంటల వ్యవధిలోనే దానం నాగేందర్ స్పందించారు. ‘నేను బీఆర్‌ఎస్ పార్టీకి రాజీనామా చేయలేదు. బీఆర్‌ఎస్ ఇచ్చి న అనర్హత పిటిషన్‌ను కొట్టివేయాలి’ అని స్పీకర్‌కు దానం అఫిడవిట్ దాఖలు చేశారు. బీఆర్ ఎస్ నుంచి తనను సస్పెండ్ చేసినట్లుగా సమాచారం లేదని, తాను బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేయలేదని స్పష్టం చేశారు. తాను 2024 మార్చిలో కాంగ్రెస్ సమావేశానికి వెళ్లానని, అది వ్యక్తిగత హోదాలో మాత్రమే హాజ రైనట్లు తెలిపారు.
మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగానే పార్టీ మారినట్లు బీఆర్‌ఎస్ భావిస్తోందన్నారు. బీఆర్‌ఎస్ అనర్హత పిటిషన్‌లోని అంశాలపై మాత్రమే వివరణ ఇస్తున్నానని, గతంలో కోర్టు తీర్పులను అనుసరించి బీఆర్‌ఎస్ అనర్హత పిటిషన్ చెల్లుబాటు కాదన్నారు. అనర్హత పిటిషన్ తర్వాతి పరిణామాలను అనుబంధ సమాచారంగా అంగీకరించొద్దని, పార్టీ ఫిరాయింపులకు పాల్పపడ్డారన్న పిటిషన్‌ను కొట్టివేయాలని స్పీకర్‌ను కోరినట్లు చెప్పారు. దానం వాదనపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? జరగబోయే పరిణామాలపై బీఆర్‌ఎస్ ఎలా స్పందించబోతుందనేది సర్వ త్రా ఉత్కంఠ రేపుతోంది.