calender_icon.png 29 January, 2026 | 2:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ లో కొన్నిచోట్ల సమన్వయ లోపం

29-01-2026 12:36:14 AM

  1. పాత, కొత్త నేతల సమన్వయానికి కమిటీ వేయాలి 
  2. కొందరు పోలీస్ అధికారుల తీరుతో ప్రభుత్వానికి చెడ్డపేరు
  3. అర్ధరాత్రి అరెస్టులు చేయాలని కాంగ్రెస్ సీఎంలు చెప్పరు 
  4. ప్రభుత్వం వారిని పక్కన పెట్టాలి 
  5. వలసొచ్చిన ఎమ్మెల్యేలు బ్లాక్‌మెయిల్ చేస్తామంటే కుదరదు
  6. పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ

హైదరాబాద్, జనవరి 28 (విజయక్రాంతి) : బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరిన నియోజకవర్గాల్లో  కొత్త, పాత నేతల మధ్య సమన్వయ లోపం కనిపిస్తోందని.. అందుకు కమిటీ వేయాలని పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయా ష్కీగౌడ్ పార్టీ అధిష్ఠానానికి సూచించారు. రాష్ట్రంలో కొందరు పోలీస్ అధికారులు ఇంకా పాత ప్రభుత్వ అలవాట్లను వదులుకోవడం లేదని.. వారి తీరు వల్ల ప్రజా ప్రభుత్వానికి చెడ్డపేరు వ స్తోందని మండిపడ్డారు.  బుధవారం ఆయన గాంధీభవ న్‌లో మీడియాతో చిట్‌చాట్ నిర్వహించా రు.

ఓ కీలక పోలీస్ కమిషనర్‌లా అండ్ ఆర్డర్‌ను పర్యవేక్షించడం మానేసి, కేవలం భూ వివాదాలు, ల్యాండ్ సెటిల్‌మెంట్లపైనే ఫోకస్ పెట్టారని ఆరోపించారు. మరి కొందరు అధికారులు నిజాయితీగా పని చేసినా.. వార్తల్లో నిలవడానికి, పబ్లిసిటీ కోసం మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారని మధుయాష్కీ విమర్శించారు. ఏ కాంగ్రెస్ సీఎం కూడా అర్ధరా త్రి అరెస్టులు చేయమని ఆదేశించరని, పోలీసులు అత్యుత్సాహంతో ప్రభుత్వం ప్రతిష్టను దిగజారుస్తున్నారని మండిపడ్డారు. నగర పోలీసు కమిషనర్ అమాయకుల మీద ప్ర తాపం చూపిస్తున్నారని ఆరోపించారు.

పదేళ్ల బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఇష్టారాజ్యాంగా వ్యవహరించిన కొందరు అధికారు లు, ఇప్పటికే అదే పంథాను కొనసాగిస్తున్నారని, వారిని వెంట నే పక్కన పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం నడుస్తోందని, ఇక్కడ చట్టం తన పని తాను చేయాలి..  తప్ప వ్యక్తుల ప్రయోజనాల కోసం లేదా పబ్లిసిటీ కోసం పని చేయకూడదన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాం లో కొందరు పోలీసు అధికారులు బీఆర్‌ఎస్ కార్యకర్తలుగా పని చేసి అక్రమంగా సంపాదించారని, ఫ్రెండ్లీ పోలీస్ అంటే డ్రగ్స్ ఫెడర్లలకు ఫ్రెండ్లీ పోలీసుగా మారారని ఆయన దుయ్యబట్టారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని, బీఆర్‌ఎస్, బీజేపీలు బలహీనంగా ఉన్నయాన్నారు.

కవితను చేర్చుకునే దుస్థితిలో కాంగ్రెస్ లేదు 

లిక్కర్ స్కామ్‌లో ఉన్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితను పార్టీలో చేర్చుకునే దుస్థితిలో కాంగ్రెస్ లేదని మధుయాష్కి స్పష్టం చేశా రు. తెలంగాణలో ప్రజలు ప్రాణ త్యాగాలు చేసుకుంటే.. కేటీఆర్, హరీశ్‌రావు, కవితలు 2010 లోనే  అమెరికాలో కంపెనీలు పెట్టారని తెలిపారు. కవిత తెలంగాణ ఉద్యమంలో సంపాదిం చిందని, మళ్లీ రాజకీయాల్లోకి వచ్చాక సంపాదించిందని, అప్పుడే జిల్లాకో పీఏను పెట్టుకున్నారని మధుయాష్కీ చెప్పారు. కవిత రూ.3వేల కోట్లతో రాజభవంతి కూడా కట్టుకుందన్నారు.  నైనీ టెండర్లలో కాంట్రాక్టుల కేటాయింపే కాలేదు, బొగ్గు తీయలేదు.. స్కామ్ ఎలా జరుగుతుందని మధుయాష్కి ప్రశ్నించారు. 

నేషనల్ హెరాల్డ్ కేసులో ఎక్కడైనా రాహుల్‌గాంధీ, సోనియాగాంధీ బ్యాంకు ఖాతా లో ఒక్క రూపాయి పడినట్లు నిరూపిస్తారా..? అని ఆయన నిలదీశారు.  

సమన్వయ బాధ్యత ఇన్‌చార్జి మంత్రులదే..

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరిన నియోజకవర్గాల్లో  కొత్త, పాత నేతలను సమన్వయం చేయాల్సిన బాధ్యత ఇన్‌చార్జ్ మంత్రులదేనని మధుయాష్కి సూచించారు. అభివృద్ధి కొరకు కాంగ్రెస్‌లో చేరిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు బ్లాక్ మెయిల్ చేయాలనుకుంటే కుదరదని, వారు పాత కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకోవాలన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రుల మధ్య సమన్వయం ఉందన్నారు. అనుభవం ఉన్న సీనియర్లు పదవులు ఉన్నా లేకున్నా పార్టీ కోసం పని చేస్తారని చెప్పారు.

మాజీ మంత్రి జీవన్‌రెడ్డి పార్టీ కోసం ఎంతో కష్టపడ్డారని, కేసీఆర్ ఎన్ని ఆహ్వానాలు పంపినా ప్రతిపక్ష పార్టీగా పోరాటం చేశారని  తెలిపారు. జీవన్‌రెడ్డి పార్టీ మారాలనుకుంటే కేసీఆర్ హయాంలోనే మారేవారని, ఇప్పుడు పార్టీ మారుతారని అనుకోనని, ఆయనను పీసీసీ అధ్యక్షుడిగా నియమించాలని పార్టీ అధిష్ఠానం ఒక దశలో ఆలోచన చేసిందని మధుయాష్కీ చెప్పారు.  ఎమ్మెల్యే దానం నాగేందర్ అంశం స్పీకర్ పరిధిలో ఉందన్నారు. స్పీకర్ నిర్ణయాన్ని కోర్టులు అంగీకరించొచ్చు, తిరస్కరించవచ్చన్నారు.