30-01-2026 06:23:47 PM
మర్రిగూడ,(విజయక్రాంతి): రాజీవ్ ఆరోగ్యశ్రీ విభాగంలో పనిచేస్తున్న ఆరోగ్య మిత్రాలు తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కొరకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఉద్యోగ సంఘ నాయకులతో ఆగస్టు 20,2024న చర్చలు జరిపి ఆరోగ్య మిత్రాల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. ప్రత్యేకమైన హామీ ఇవ్వడంతో వెంటనే యూనియన్ పరంగా రాతపూర్వకంగా సమ్మె విరమించి ఆరోగ్యమిత్రాలు విధుల్లోకి చేరారు. నాటి చర్చల సందర్భంగా మంత్రి ఇచ్చిన హామీ ప్రకారం... ఆరోగ్యమిత్రాలకు డీఈఓ డాటా ఎంట్రీ ఆపరేటర్ క్యాడర్ స్ట్రెంత్ కల్పిస్తూ ఫైనాన్సులో ఫైల్ అప్రూవల్ చేయించారు.
అలాగే ఎనిమిది గంటల పని విధానం కల్పించారు. ఆరోగ్య మిత్రలకు సాధారణ సెలవులు కూడా మంజూరు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రిని శుక్రవారం హైదరాబాద్ మినిస్టర్ కోటర్స్ లో తన నివాసంలో కలిసి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో ఆరోగ్య మిత్రాలను ఆరోగ్యశ్రీ ట్రస్టు ఉద్యోగులుగా గుర్తించాలని, ఖాళీలన్నిటిని భర్తీ చేయాలని, విధి నిర్వహణలో మరణించిన ఆరోగ్య మిత్రలకు 50 లక్షల ఎక్స్గ్రేషియా కల్పించాలని మంత్రినీ కోరినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు గిరి యాదయ్య ప్రధాన కార్యదర్శి కుమార్, ఉపాధ్యక్షులు సుమన్, రాష్ట్ర కమిటీ సభ్యులు కిషోర్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు రత్నం, నల్గొండ జిల్లా అధ్యక్షులు నాగరాజు పాల్గొన్నారు