20-09-2025 12:26:46 AM
ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి
వలిగొండ, సెప్టెంబర్ 19 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తుందని, క్రీడలను, క్రీడాకారులను ప్రోత్సహిస్తుందని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం వలిగొండ మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో 67వ జిల్లా పాఠశాల స్థాయి కబడ్డీ క్రీడోత్సవాలను ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ వలిగొండలో జిల్లా స్థాయి పోటీలు నిర్వహించడం అభినందనీయమని ఆయన అన్నారు. పోటీలలో పాల్గొనే క్రీడాకారులు తమ క్రీడా స్ఫూర్తిని చాటుకోవాలని గెలుపు, ఓటమి క్రీడల్లో సహజమని ప్రతి ఓటమి వెనుక గెలుపు ఉంటుందని ఆయన అన్నారు. క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు శారీరక ఉల్లాసాన్ని కూడా అందజేస్తాయని అన్నారు.
ఈ క్రీడోత్సవాలను తన తమ్ముడి జ్ఞాపకార్థం ఉపాధ్యాయుడు పసల విజయ్ ఆనంద్ నిర్వహించడం అభినందనీయమని అన్నారు .ఈ కార్యక్రమంలో తహసిల్దార్ దశరథ, ఎంపీడీవో జలంధర్ రెడ్డి, ఎంఈఓ సుంకోజు భాస్కర్, వివిధ పాఠశాలల పిఈటిలు, పీడీలు తదితరులు పాల్గొన్నారు.