02-09-2025 12:50:07 PM
హైదరాబాద్: బీఆర్ఎస్(Bharat Rashtra Samithi) హయంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. విచారణ అనంతరం జస్టిస్ పీసీ ఘోష్ ఇచ్చిన నివేదికపై రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ(Central Bureau of Investigation) దర్యాప్తును ఆదేశించింది. ఈ నేపథ్యంలో మంగళవారం సీబీఐ విచారణ కోరుతూ కేంద్ర హోంశాఖకు రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. కాళేశ్వరం ఆనకట్టలపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం సీబీఐను కోరింది. కాళేశ్వరం నిర్మాణంలో లోపాలు ఉన్నట్లు ఎన్డీఎస్ఏ గుర్తించిందని.. ప్రణాళిక, డిజైన్, నాణ్యత, నిర్మాణంలో లోపాలు ఉన్నాయని లేఖలో పేర్కొంది. జస్టిస్ పీసీ ఘోష్ విచారణ కమిటీ కూడా లోపాలను గుర్తించిందని.. ఎన్డీఎస్ఏ నివేదికపై అసెంబ్లీలో చర్చించామని రాష్ట్ర ప్రభుత్వం లేఖలో తెలిపింది. కాగా, కాళేశ్వరం ప్రాజెక్టుపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కాంగ్రెస్ ప్రభుత్వానికి చేతగాక సీబీఐకి అప్పజేప్పరని ఆరోపించిన విషయం తెలిసిందే.