08-10-2025 12:00:00 AM
తిప్పలు పడుతున్న రైలు ప్రయాణికులు
మహబూబాబాద్, అక్టోబర్ 7 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేసము ద్రం రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు ‘స్లో’గా సాగుతుండడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నూతనంగా చేపట్టిన మూడవ నంబర్ ప్లాట్ ఫామ్ ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం పనులు జాప్యం చేస్తుండడంతో ప్రయాణికులు ప్లాట్ ఫారం ఎక్కడానికి దిగడానికి యాతన పడుతున్నారు. అలాగే 2,3 నెంబర్ ప్లాట్ ఫామ్ పై మరుగుదొడ్లు, టాయిలెట్లు నిర్మించలేదు.
రైల్వే స్టేషన్ బుకింగ్ కౌంటర్ నుండి రెండవ నెంబర్ ప్లాట్ ఫామ్ కు దిగడానికి ఫుట్ ఓవర్ బ్రిడ్జి ఉండగా, కొత్తగా 3,4వ రైల్వే ట్రాక్ నిర్మించిన తర్వాత 4వ రైల్వే ట్రాక్ దాటడానికి ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు. కొత్తగా అనుసంధానించే ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం పనులు నత్తనడకన చేస్తున్నారని, దీనివల్ల కల్వల, అమీనాపురం, కేసముద్రం విలేజ్, తదితర ప్రాంతాల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక 2,3వ ఫ్లాట్ ఫారం పై మరుగుదొడ్లు, మూత్రశాలలు ఏర్పాటు చేయకపోవడంతో రైళ్ల కోసం నిరీక్షించే ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అలాగే తాగునీటి వసతి పునరుద్ధరించలేదు. కొత్తగా ప్లాట్ఫారం నిర్మాణం కోసం గతంలో ఉన్న తాగునీటి నల్లాలను తొలగించి కొత్తగా నిర్మాణం చేపట్టినప్పటికీ పైప్ లైన్ కనెక్షన్ ఇవ్వకుండా వదిలేయడంతో తాగునీరు కోసం ఒకటో నెంబర్ ప్లాట్ ఫామ్ కు వెళ్లి తెచ్చుకోవాల్సి వస్తుందని చెబుతున్నారు. అలాగే స్టేషన్లో కూర్చోవడానికి ప్రయాణికులకు సరిపడా కుర్చీలు లేవని, దీనితో రైలు వచ్చేంతవరకు నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెబుతున్నారు. రైల్వే స్టేషన్లో కోచ్ డిస్ప్లే బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతో రైలు వచ్చేంతవరకు రిజర్వేషన్, జనరల్ కోచ్ కోసం వెతుక్కోవలసిన పరిస్థితి ఏర్పడిందని చెబుతున్నారు.
కోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్ధి పనులు చేపడుతున్న రైల్వే శాఖ అధికారులు ప్రయాణికులకు అసౌకర్యం కలిగించకుండా పనులు చేపట్టాలని కోరుతున్నారు. ఇదిలా ఉండగా రైల్వే స్టేషన్లో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో నాణ్యత కొరవడిందని, సిమెంట్ కాంక్రీట్ తో వేస్తున్న ప్లాట్ ఫామ్ నెలరోజులు కాకముందే పగుళ్లు ఏర్పడ్డాయని చెబుతున్నారు. రైల్వే అధికారులు ఈ విషయంలో స్పందించి పనులు నాణ్యతగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, వెంటనే ప్రయాణికులకు మరుగుదొడ్లు, మూత్రశాలలు, తాగునీటి వసతి కల్పించాలని కోరుతున్నారు.