30-08-2025 12:48:21 AM
అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి
ఘట్ కేసర్, ఆగస్టు 29 : రెవెన్యూ సదస్సులలో , భూ భారతి సదస్సులలో వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని మేడ్చల్ జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఘట్ కేసర్ తహాశీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ రెవెన్యూ సదస్సులలో, భూ భారతి సదస్సులలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి తగిన సూచనలు, సలహాలు ఇచ్చి వాటి సత్వర పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ తో పాటు రెవెన్యూ సిబ్బందిని ఆదేశించారు.
ఇప్పటివరకు పరిష్కారం కాని దరఖాస్తులను వెంటనే ప్రభుత్వానికి విన్నవించి ప్రభుత్వ నిబంధనల మేరకు పూర్తి అయ్యేలా చూడాలని సూచించారు. రెవెన్యూ రికార్డులను, పరిపాలన పరమైన రిజిష్టర్లను ఆయన పరిశీలించారు. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని కులం, నివాస (స్ధానికత) సర్టిఫికెట్లు, ఆదాయం, ఇతరత్రా సర్టిఫికెట్ల జారీ నిమిత్తం చేసుకున్న దరఖాస్తులను పెండింగ్ లేకుండా చూడాలని సూచించారు.
పరిపాలన పరమైన ఫైళ్ళను పెండింగ్ లేకుండా చూసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. అదేవిధంగా క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యల గురించి తహసిల్దార్ ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఘట్ కేసర్ మున్సిపల్ కమీషనర్ రాజేష్ తో కలిసి ఏదులాబాదు చెరువులో వినాయక నిమజ్జన ఏర్పాట్లను అదనపు కలెక్టర్ పరిశీలించారు. సంబంధిత శాఖల అధికారలకు అవసరమైన సలహాలు, సూచనలు చేశారు. ఈకార్యక్రమంలో తహసిల్దార్ రజని, డిప్యూటీ తహసిల్దార్ రాజేందర్, సీనియర్ అసిస్టెంట్ ఆదిత్య, సర్వేయర్ రూప, రెవెన్యూ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.