30-08-2025 05:31:51 PM
బీజేపీ నంగునూరు మండల అధ్యక్షుడు వెంకట్రామ్ రెడ్డి
నంగునూరు: రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను నంగునూర్ మండల బీజేపీ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి(BJP President Venkatrami Reddy) ఖండించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తల్లిపై రాహుల్ గాంధీ అనుచిత వ్యాఖ్యలు చేశారని, 'ఓటు చోర్' నినాదం హాస్యాస్పదంగా ఉందని మండిపడ్డారు. మండల కేంద్రంలో రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా నిరసన చేసి మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వ హయాంలో తయారు చేసిన ఓటరు జాబితాలోనే దొంగ ఓట్లు ఉన్నాయని కాంగ్రెస్ ఆరోపించడం సిగ్గుచేటన్నారు. ఎన్నికల కమిషన్ ఓటర్ల జాబితాను సరిచేయాలని తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతోందని, అందుకే రాహుల్ గాంధీ అవగాహన లేకుండా ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.
రాహుల్ గాంధీ వెంటనే బేషరతుగా క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు. బీహార్ ఎన్నికల్లో రోహింగ్యా, దొంగ ఓట్లతో గెలవాలని కాంగ్రెస్ కలలు కంటుందని వెంకట్రామిరెడ్డి ఆరోపించారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలన్నది ఒక నెరవేరని కలగానే మిగిలిపోతుందని ఎద్దేవ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రావణ్ కుమార్, జిల్లా ఉపాధ్యక్షుడు తిరుపతి రావు, జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షుడు తిరుపతి రెడ్డి, సీనియర్ నాయకులు రాజినికర్ రెడ్డి, రత్నాకర్ రెడ్డి, నరేష్, సతీష్ గౌడ్, పరమేశ్వర రెడ్డి, యాదగిరి, భూపాల్ రెడ్డి, శ్రీకాంత్, కృష్ణ ప్రసాద్, శ్రీకాంతాచారి తదితరులు పాల్గొన్నారు.