30-08-2025 06:05:39 PM
సూర్యాపేట,(విజయక్రాంతి): పాత నేరస్తులు, హిస్టరీ షీట్స్ కలిగిన వ్యక్తులు, గంజాయి కేసులో ఉన్న నిందితులు చట్టపరిధికి లోబడి నడుచుకోవాలని ఎస్పీ కే.నర్సింహ అన్నారు. సూర్యాపేట సబ్ డివిజనల్ పరిధిలో పోలీస్ స్టేషన్ ల నందు నమోదు కాబడిన పాత నేరస్తులకు పట్టణంలోనీ రవి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ నందు సూర్యాపేట డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో శనివారం చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ వ్యక్తిగత ప్రవర్తనల గురించి, ప్రవర్తనలో మార్పుల గురించి, చట్ట పరిధిలో నడుచుకోవడం మొదలగు అంశాల గురించి అవగాహన కల్పించారు.
అలవాటుగా అదే రకమైన నేరానికి పాల్పడితే పీడీ యాక్ట్ నమోదు చేసి జైలుకు పంపుతామని హెచ్చరించారు. ఇలాంటి వ్యక్తులను ముందస్తుగా కౌన్సెలింగ్ నిర్వహించి, బైండోవర్ చేస్తామన్నారు. బైండోవర్ అనేది మళ్లీ నేరానికి పాల్పడను అని ఇచ్చే హామీ, బైండోవర్ నిబంధనలు ఉల్లంఘిస్తే అలాంటివారిని పూచి నగదును జమ చేయిస్తామన్నారు. గ్రామాల్లో పట్టణాల్లో శాంతియుత వాతావరణం కోసం పోలీస్ శాఖ అనుక్షణం కృషి చేస్తుందన్నారు. ఎవరైనా వ్యక్తులు ఇతరులను ఇబ్బందులకు గురి చేయడం, సమస్యలు సృష్టించడం, సమస్యలు సృష్టించే వారిని ప్రోత్సహించడం, సహకరించడం లాంటివి చేస్తే కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.