30-08-2025 06:02:14 PM
సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరి బాలరాజు
వలిగొండ (విజయక్రాంతి): వలిగొండ మండల వ్యాప్తంగా నెలకొన్న స్థానిక ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వీడాలని, వెంటనే సమస్యల పరిష్కారం కోసం అన్ని రాజకీయ పార్టీలతో స్థానిక ఎమ్మెల్యే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరి బాలరాజు(CPM District Secretary Group Member Maturi Balaraju), జిల్లా కమిటీ సభ్యులు మద్దెల రాజయ్య డిమాండ్ చేశారు. శనివారం మండల వ్యాప్తంగా నెలకొన్న స్థానిక ప్రజా సమస్యలను పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ తాసిల్దార్ కార్యాలయం ముందు సిపిఎం మహాధర్నా కార్యక్రమం చేపట్టింది.
ఈ ధర్నా కార్యక్రమానికి సిపిఎం మండల కార్యదర్శి సిర్పంగి స్వామి అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా పాల్గొన్న మాటూరి బాలరాజు, రాజయ్యలు మాట్లాడుతూ, 37 గ్రామపంచాయతీలు ఉన్న వలిగొండ మండలంలో అనేక ప్రజాసమస్యలు తిష్ట వేసి కూర్చున్నాయని ప్రజలు ఆ సమస్యలతో తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని గ్రామపంచాయతీలకు స్పెషల్ అధికారులను నియమించిన ఒక్క రూపాయి కేటాయించకపోవడంతో వారు సమస్యల్ని పరిష్కారం చేయలేకపోతున్నారని వెంటనే మండలంలో అన్ని రాజకీయ పార్టీలతో అఖిలపక్ష సమావేశాన్ని స్థానిక ఎమ్మెల్యే ఏర్పాటుచేసి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని డిమాండ్ చేశారు. ఏదుళ్ళగూడెం రైల్వే బ్రిడ్జి కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అతనిపై వెంటనే చట్టపరమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు దెబ్బతిన్న పంట పొలాలను అధికారులు పరిశీలించి పంట నష్టాన్ని అంచనా వేసి రైతాంగానికి నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వలిగొండ చెరువు కట్ట నుండి రైల్వే స్టేషన్ వరకు వెంటనే బీటీ రోడ్డు నిర్మాణం చేయాలని వలిగొండ మండల కేంద్రంలో ట్రాన్స్ఫార్మర్ రిపేరింగ్ సెంటర్ ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.