30-08-2025 05:27:54 PM
భద్రాచలం,(విజయక్రాంతి): రాష్ట్రంలో అధిక వర్షాలు కురుస్తున్నందున చాలా గ్రామాలలోవరదల దాటికి గ్రామాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనుచున్నందున ఈపరిస్థితులను దృష్టిలో పెట్టుకొని గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలు, గురుకులాలు, వసతిగృహాలలో చదువుతున్న గిరిజన విద్యార్థిని విద్యార్థుల ఆరోగ్య స్థితిగతులను గమనిస్తూ, వరద తాకిడికి గురి అయ్యే పాఠశాలల పట్ల సంబంధిత అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మాత్యులు అడ్లూరి లక్ష్మణ్ సంబంధిత అధికారులకు ఆదేశించారు.
హైదరాబాదు నుండి గిరిజన సంక్షేమ శాఖ సెక్రెటరీ అలుగు వర్షిని, గురుకులం ప్రిన్సిపాల్ సెక్రటరీ సీతాలక్ష్మి, అడిషనల్ డైరెక్టర్ సర్వేశ్వర్ రెడ్డి, డిడి ట్రైబల్ వెల్ఫేర్ దిలీప్ కుమార్ తో కలిసి రాష్ట్రంలోని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారులు, డిడి ట్రైబల్ వెల్ఫేర్ అధికారులు, ఆర్ సి ఓ గురుకులం, డిటిడిఓలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాఠశాలలలో చదువుతున్న గిరిజన విద్యార్థినీ విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణ మరియు వారి బాగోగులపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరద తాకిడికి గురి అయ్యే గ్రామాలలో ఉన్న గిరిజన సంక్షేమ శాఖ ఇన్స్టిట్యూషన్లలో చదువుతున్న పిల్లల పట్ల ప్రత్యేక రక్షణ చర్యలు తీసుకోవాలని అన్నారు.
విద్యార్థినీ విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు తప్పనిసరిగా ప్రతి ఇన్స్టిట్యూషన్లో మెడికల్ క్యాంపులు నిర్వహించి పిల్లలందరికీ వైద్య పరీక్షలు చేయించాలని, వరద తాకిడికి గురి అవుతున్న గ్రామాలలో ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాలు, గురుకులం కళాశాల, పాఠశాలలు ఉంటే పిల్లలను వేరే పాఠశాలలకు తరలించాలని, పాఠశాలలు కానీ వసతి గృహాలు కానీ పాతవి గనుక ఉంటే వాటిలో పిల్లలు వెళ్లకుండా చూడాలని, పాఠశాల, వసతిగృహాలు మరమ్మత్తులు మరియు కాంపౌండ్ వాల్స్ నిర్మాణం, విద్యుత్ సౌకర్యం, మంచినీటి సౌకర్యం, టాయిలెట్లు, బాత్రూమ్ లకు సంబంధించిన ప్రతిపాదనలు తయారుచేసి ట్రైబల్ వెల్ఫేర్ కార్యాలయానికి త్వరితగతిన పంపించాలని అన్నారు.
ఈ మధ్య ఎక్కువ శాతం గురుకులాలు, ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నందున పిల్లలకు మెనూ ప్రకారం తాజా కూరగాయలతో వేడిగా ఉన్నప్పుడే ఆహారము అందించాలని, వంట చేసే సిబ్బంది పరిశుభ్రతను పాటించి వంటగదిని శుభ్రంగా ఉంచుకొని చాలా జాగ్రత్తగా వంటలు చేయాలని, హెచ్ఎం వార్డెన్, ఉపాధ్యాయులు వంట సిబ్బంది వండిన ఆహారాన్ని ముందుగా తిన్న తర్వాతనే పిల్లలకు సరఫరా చేయాలని, ఆహారం విషయంలో అలసత్వం వహించే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు.
తమరు సూచనలు ప్రకారము వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకొని వరద తాకిడికి గురి అవుతున్న గ్రామాలలోనీ ఆశ్రమ పాఠశాల, గురుకులం కళాశాల, పాఠశాల, వసతి గృహాలలో చదువుతున్న గిరిజన విద్యార్థిని,విద్యార్థుల పట్ల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నామని, ప్రస్తుతం అన్ని పాఠశాలల్లో సౌకర్యాలు సమకూర్చామని, విద్యార్థుల ఆరోగ్య స్థితిగతులను పరిరక్షించేలా మెడికల్ ఆఫీసర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించి మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకున్నామన్నారు.
వరదల వలన ఏమైనా ఇబ్బందులు తలెత్తితే సమాచారం అందించడానికి ఐటీడీఏ కార్యాలయంలో వరదల కంట్రోల్ రూమ్ తో పాటు హెల్ప్ లైన్ డిస్క్ ఏర్పాటు చేశామని, గిరిజన విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణతో పాటు వారి చదువుకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఐటీడీఏ ద్వారా ప్రత్యేక అధికారులు, డిడి ట్రైబల్ వెల్ఫేర్ అధికారులు, ఆర్ సి ఓ గురుకులం, ఎస్సీఆర్పీలతో పర్యవేక్షణ చేయించి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని పిఓ మంత్రివర్యులకు తెలిపారు.