06-05-2025 12:10:11 AM
జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి
గోపాల్ పేట, మే 05 : భూ భారతి రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తులను సాధ్యమైనంత వరకు త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. రెవెన్యూ సదస్సు నిర్వహణకు పైలెట్ మండలంగా గోపాలపేటను ఎంపిక చేసిన నేపథ్యంలో సోమవారం చెన్నూరు, జయన్న తీర్మలాపూర్ గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించారు.
జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి జయన్న తీర్మలాపూర్ గ్రామాన్ని సందర్శించి గ్రామ సచివాలయంలో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సును పరిశీలించారు. మొత్తం వచ్చిన దరఖాస్తులు, ఏ రకమైన దరఖాస్తులు వచ్చాయో స్వయంగా పరిశీలించారు. చెన్నూరు గ్రామంలో మొత్తం 36 దరఖాస్తులు, జయన్న తీర్మలాపూర్ గ్రామంలో 25 వెరసి 61 దరఖాస్తులు స్వీకరించినట్లు తహసిల్దార్ పాండు వివరించారు.
అందులో సెక్సేషన్ 18, మిస్సింగ్ సర్వే 2, పెండింగ్ మ్యుటేషన్ 1, డిజిటల్ సైన్ 1, ఎక్స్టెంట్ వెరియషన్ 2, నేమ్ కరెక్షన్ 5, పార్ట్ బి 1, అసైన్డ్ పట్టా 3, ఇతరములు 28 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. కలెక్టర్ స్పందిస్తూ సాధ్యమైనంత వరకు అక్కడికక్కడే పరిష్కరించే ప్రయత్నం చేయాలని, సక్సెషన్ కు సంబంధించి వెంటనే నోటీస్ లు జారీ చెయ్యాలని సూచించారు. కుటుంబ సభ్యుల ధృవ పత్రాలకు ఒక మీసేవ సిబ్బందిని సిస్టమ్ తో పాటు వెంట కూర్చోబెట్టుకొని త్వరగా అయ్యేటట్లు చూడాలని ఆదేశించారు. ఆర్డీవో సుబ్రహ్మణ్యం, గోపాల్పేట తహాసిల్దార్ పాండు, తహసిల్దార్ రాజు, డిటి తిలక్ రెడ్డి ఇతర రెవెన్యూ సిబ్బంది కలెక్టర్ వెంట ఉన్నారు.