28-11-2025 12:04:45 AM
హైదరాబాద్, నవంబర్27 : పంచాయతీ ఎన్నికల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లకు సంబంధించి మార్గాదర్శకాలను వెల్లడిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీఓ 46ను నిలిపివేయాలని కోరుతూ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలైంది. గంగపుత్ర రాష్ట్ర సంఘం, మడివాల మాచదేవ రజకుల సంఘంతో పాటు మరో ఈ ముగ్గురు పిటిషన్ వేశారు. దీనిపై గురువారం కోర్టులో వాదనలు జరిగాయి.
పంచాయతీ రాజ్ చట్టం సెక్షన్ 9(4) ప్రకారం.. ‘ప్రభుత్వం పంచాయతీ ఎన్నికల్లో బీసీ బీ, సీ, డీలకు కేటగిరీ వారీగా రిజర్వేషన్లు కల్పించలేదు. అనంతరామన్ కమిషన్‌ను ప్రభుత్వం విస్మరించింది. దీంతో బీసీల్లోని కాపు, ముది రాజ్, యాదవ, గౌడవర్గాలే స్థానిక సంస్థల్లో రాజకీయ అధికారాన్ని పొందుతాయి. ఇతర బీసీ వర్గాల వారు పేదలుగానే మిగిలిపోతారు.
చట్ట ప్రకారం బీసీ రిజర్వేషన్లను ఏ, బీ, సీ, డీలుగా వర్గీకరించాలి. ఆ తర్వాతే ఎన్నికలు నిర్వహించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలి’ అని పిటిషనర్ల తరఫు న్యాయవాది సుదర్శన్ వాదనలు వినిపించారు. అత్యవసర పిటిషన్ కింద విచారించాలని కోరారు. దీనిపై శుక్రవారం విచారణ జరుపుతామని ధర్మాసనం పేర్కొంది.
మహబూబ్ పట్నం ఎన్నికలపై స్టే
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం మహబూబ్ పట్నం పంచాయతీ ఎన్నికల నిర్వహణపై హైకోర్టు స్టే విధించింది. ఆరుగురు ఓటర్లు ఉన్న ఎస్టీలకు ఒక సర్పంచ్, మూడు వార్డుస్థానాలు ఎలా రిజ ర్వ్ చేశారంటూ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఆరుగురు ఎస్టీ ఓటర్లు ఒకటే వార్డులో ఉంటే, మిగతా వార్డు సభ్యులను ఎలా ఎంపిక చేస్తారని అక్షింతలు వేసింది.
గ్రామంలో రిజర్వేషన్లు మార్చాలని పలువురు గ్రామస్తులు హైకోర్టును ఆశ్రయిం చారు. మహబూబ్ పట్నంలో 2011 జనాభా లెక్కల ప్రకారం.. ప్రస్తుతం సర్పంచ్ స్థానంతో పాటు మూడు వార్డులు ఎస్టీలకు దక్కాయి. కేవలం రెండు కుటుంబాలకు చెందిన వారు సమీప బంధువులు కాగా, ఎవరు ఏ పదవులకు, ఏ పార్టీ నుంచి పోటీచేస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. దీనిపై హైకోర్టు పై విధంగా స్పందించింది.