calender_icon.png 22 December, 2025 | 3:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘చైతన్య స్రవంతి’ శిల్పి

22-12-2025 01:18:33 AM

24న అంపశయ్య నవీన్ జన్మదినం :

తెలుగు నవలా ప్రపంచంలో అంపశయ్య నవీన్‌ది ప్రత్యేక స్థానం. ౧౯౭౦లలో ఆయన సంచలన నవల రాశారు. దాని పేరే ‘అంపశయ్య’. అప్పటి రాజకీయ, సామాజిక పరిస్థితులకు అద్దంపట్టిన ఆ నవల ఆయనకు ఎనలేని కీర్తిప్రతిష్ఠలు తీసుకొచ్చింది. ఆయన అసలు పేరు దొంగరి మల్లయ్య. ఆయన 1941 డిసెంబర్ 24న వరంగల్ జిల్లా (అప్పటి) పాలకుర్తి మండలం వావిలాల గ్రామంలో ఒక సాధారణ వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. తల్లిదండ్రులు దొంగరి నారాయణ, పిచ్చమ్మ.

ఆయన ప్రాథమిక విద్యాభ్యాసం స్వగ్రామంలో సాగింది. బాల్యం నుంచే ఆయన గ్రామీణ వాతావరణం, అక్కడి మనుషుల జీవన శైలిని ఆసక్తిగా గమనించేవారు. బుర్రకథలు, హరికథలు, నాటకాల పట్ల ఆయనకు మక్కువ ఉండేది. ఆ మక్కువతోనే ఆయన తెలిసీతెలియని ప్రాయంలో రచనా వ్యాసాంగంలోకి అడుగుపెట్టారు. నాలుగో తరగతిలోనే ఆయన ‘చందమామ’ పత్రికకు ఒక చిన్న కథ రాశారు. వరంగల్‌లో హైస్కూల్, కాలేజీ విద్య అభ్యసించారు. హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఆర్థిక శాస్త్రంలో ఎంఏ పూర్తి చేశారు.

అక్కడి విద్యార్థి ఉద్యమాలు, సమకాలీన రాజకీయాలు ఆయన్ను ప్రభావితం చేశాయి. ఆ సమయంలోనే తనకు తన పేరు మార్చుకోవాలనే ఆలోచన వచ్చింది. తన మిత్రుడు, కవి వరవరరావు సూచన మేరకు ‘నవీన్’ అనే కలం పేరును స్వీకరించారు. నవీన్ 1964లో నల్లగొండ డిగ్రీ కళాశాలలో అధ్యపకుడిగా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. అక్కడి మొదలు 32 ఏళ్ల పాటు అధ్యాపకుడిగా పిల్లలకు పాఠాలు బోధించారు. ప్రిన్సిపాల్ పలు కళాశాలల్లో బాధ్యతలు నిర్వర్తించారు.

ఆ.. నవల సంచలనం.. చివరికి ఇంటి పేరుగా

1969లో నాటి సామాజిక, రాజకీయ పరిస్థితులు ఆయనపై ఎంతో ప్రభావాన్ని చూపాయి. తన చుట్టూ ఉన్న విద్యార్థులు, స్నేహితుల మానసిక సంఘర్షణను ఆయన దగ్గరుండి గమనించారు. ఆ సంఘర్షణల ఇతివృత్తంగా ఆయన ‘అంపశయ్య’ అనే నవలను వెలువరించారు. ఈ నవల తెలుగు సాహిత్యంలో అప్పుడో ఒక సంచలనం. ఒక యువకుడు వర్సిటీ హాస్టల్ గదిలో గడిపిన 16 గంటల సమయాన్ని నవీన్ సరికొత్త ‘చైతన్య స్రవంతి’ శిల్పంలో నవలను అద్భుతం గా ఆవిష్కరించారు.

ఈ నవల ఎంతటి ప్రాచుర్యం పొందిందంటే, అప్పటి నుంచి పాఠకులు ఆయన్ను ‘అంపశయ్య నవీన్’ అని పిలవడం ప్రారంభించారు. చివరకు అదే ఆయన ఇంటి పేరుగా స్థిరపడిపోయింది. దీనికి కొనసాగింపుగా నిరుద్యోగ సమస్యపై ‘ముళ్లపొదలు’, ఉద్యోగ జీవితంపై ‘అంతస్స్రవంతి’ నవలలు రాశారు. ఈ మూడింటికీ కలిపి ‘రవిత్రయ నవలలు’ అనే పేరుంది. ప్రత్యేకంగా ఒక టెక్నిక్ కోసం కాకుండా, పాత్రల అంతరంగాన్ని పాఠకులకు యథాతథంగా చూపించాలనే తపనతోనే తాను రచనలు చేశానని ఆయన చెబుతుంటారు.

చరిత్రకు కల్పిత రూపం ‘కాలరేఖలు’

నవీన్ సాహిత్యంలో మరో మైలురాయి ‘కాలరేఖలు’ నవలాత్రయం. 1944 నుంచి 1995 వరకు తెలంగాణలో జరిగిన సామాజిక, రాజకీయ పరిణామాలను చిత్రించాలని ఆయన సంకల్పించారు. 1996లో పదవీ విరమణ చేసిన తర్వాత ఆయన తన పూర్తి సమయాన్నీ రచనకే కేటాయించారు. అలా ‘కాలరేఖలు’, ‘చెదిరిన స్వప్నాలు’, ‘బాంధవ్యాలు’ అనే మూడు బృహత్తర నవలలను వెలువరించారు. 1500 పేజీలకు పైగా ఉన్న ఈ గ్రంథం తెలంగాణ చరిత్రకు కల్పిత రూపం.

ఇందులో 1944 నాటి ఆంధ్ర మహాసభల నుంచి 1995 నాటి ఆర్థిక సంస్కరణల వరకు అన్ని కీలక ఘట్టాలను పొందుపరిచారు. ఈ విశిష్ట రచనకు గాను 2004లో ఆయనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. వీటితో పాటు 1975 ఎమర్జెన్సీ కాలంలోని దారుణాలను వివరిస్తూ ‘చీకటి రోజులు’ నవలను డైరీ రూపంలో రాసి, ఆనాడే తన నిర్భయత్వాన్ని చాటుకున్నారు. మహిళల సమస్యలపై ‘విచలిత’, ‘ఉమెన్స్ కాలేజ్’ వంటి రచనలు చేశారు.

మొత్తంగా 30కి పైగా నవలలు, 70కి పైగా కథలు రాసిన నవీన్, నేటికీ తన అంపశయ్య నవీన్ లిటరరీ ట్రస్ట్ ద్వారా వర్ధమాన రచయితలను ప్రోత్సహిస్తూ సాహిత్య సేవలో కొనసాగుతున్నారు. ఆయన రచనలు హిందీ, ఇంగ్లిష్, కన్నడ తదితర భాషల్లోకి అననువాదమయ్యాయి. పలువురు పరిశోధక విద్యార్థులు ఆయన సాహిత్యంపై పరిశోధనలు చేసి పీహెచ్‌డీలు పొందడం విశేషం. అయితే.. ఆయన సాహితీ ప్రస్థానంలో ఒక్క కవిత కూడా రాయకపోవడం పెద్ద లోటు అని ఆయన అభిమానులు చెప్తూ ఉంటారు.

 సాయి కిరణ్