22-12-2025 01:16:16 AM
కె.శ్రీనివాస్ సీనియర్ సంపాదకుడు :
ఉక్కిరిబిక్కిరి సుడిగుండం నుంచి స్వామి చివరకు బయటపడిపోయారు. జ్ఞాపకాల కిర్రుకిర్రు తలుపులు తెరిచే కాలయంత్రాన్ని ఇక కట్టిపెట్టారు నావ తీరం చేరింది. పరవస్తు లోకేశ్వర్ నవలా త్రయం పూర్తయింది. ఆయన అక్షరాల మంత్రనగరిలో కట్టుబడిపోయిన పాఠకులం మాత్రం అక్కడే మిగిలిపోయాం. 1969 నుంచి 2014 వరకు ౪౫ ఏళ్ల ప్రయాణం. ప్రపంచం తలకిందులైన, అలలు అలలుగా వెల్లువెత్తి విరిగిపడిన-కాలం. మూడు నవలల్లో ముడుచుకున్న వైభవోజ్జ్వల అధ్వాన శకం.
కాలం అనేక తలాలలో, అనేక స్థలాలలో, అనేక పార్శ్వాలలో ఏకకాలంలో ఉంటుంది. ఒకే చరిత్రలో మునిగితేలిన అసంఖ్యాక జీవితాలు. అనేక చరిత్రల ను రచించిన ప్రజాసమూహాలు. బీభత్సాలు, యుద్ధాలు, విప్లవాలు, విజయాలు, వైఫల్యాలు, విశ్వవిహారాలు, అణ్వస్త్రాలు, ఆకలి, పీడన, వేదన, సర్వవ్యాప్త, అనుక్షణ వీక్షణల సాక్షి - కాలం. ఒక ప్రపంచ మానవుడు. ఒక పైదాయిషీ. అనేక అలజడులు- మూడు ముక్కల్లో చెప్పాలంటే ఇదీ ‘ఈ మూడు నవలల బంగారం’ సారాంశం.
కౌమారం నుంచి యవ్వనంలోకి ప్రవేశిస్తున్న ఒక పిల్లవాడు, తన ఉనికికి సంబంధించినపోరాటంతో పరిచయం కలిగి, అక్కడి నుంచి ప్రపంచాన్నే మా ర్చే ప్రయత్నాలతో మమేకమై, ఉద్యోగి అయి, గృహస్థు అయి, లోకపు పోకడలన్నింటి మీద తనదైన విలువల అంచనాలను పెంచుకుని, తపనపడి, విచలించి, అభిరుచులతో ఉర్రూతలూగి, సాహసాలు చేసి, పునరుత్థానం చెం దిన తెలంగాణ పొలికేకను ప్రతిధ్వనించి, చివరకు దక్కిన ఒక విజయానికి పరవశించిన కథ ఇది.
కోల్పోతున్న తనదైన ప్రపంచాన్ని నిలబెట్టుకోవడానికి, కోరుకుంటున్న మంచి లో కాన్ని సాధించుకోవడానికి, అనుక్షణం అల్లాడిన తెలంగాణ వాది గాథ ఇది. ఇరవై సంవ త్సరాల కిందట ‘సలాం హైదరాబాద్’ తెలు గు పాఠకుల్ని పలకరించినప్పుడు మొదలైన గతవర్తమానాల కలనేత కథనం, ‘కల్లోల కలల కాలం’ మీదుగా ‘ తీరం చేరిన నావ’తో 2014 దగ్గర ముగిసింది. ప్రత్యేక తెలంగాణ మొదటి ఉద్యమం నుంచి మలిదశ ఉద్యమం, రాష్ర్ట అవతరణ దాకా ఈ మూడు నవలల్లో కథాకాలం గడుస్తుంది.
అట్లాగని, కథనంలో కాలం గిరిగీసుకుని ఉండదు. నూ టయాభై ఏండ్ల కిందటికీ వెడుతుంది. తుర్రెబాజ్ ఖాన్‌ను చూపిస్తుంది, ఖైరున్నీసా ప్రేమకథను చెబుతుంది, మూసీజలప్రళయా న్నీ వర్ణిస్తుంది. జనగామ రైలు ప్రమాదాన్ని పూసగుచ్చుతుంది. రచయిత ఎప్పుడూ టైమ్ మిషన్ లో సిద్ధంగా ఉండి, ముందు వెనుకలకు కదులుతూనే ఉంటారు. ఒక్కోసారి లోకేశ్వర్ క్రీడాభిరామ కర్త లాగా, వీధుల్లో సంచరిస్తూ, కనిపించిన ప్రతి విశేషాన్ని పరిచయం చేస్తూ, కథను కాసేపు ఆపి, చరిత్రను ఆవిష్కరిస్తారు. అందుకే అనేక ఉపాఖ్యానాలతో ఈ నవలలు కాత్యాయని అన్నట్టు ‘ఇతిహాస’ రీతిలో కనిపిస్తాయి.
కథాకాలానికి ముందు సింహావలోకనం
అధ్యాపకుడిగా ఉన్న స్వామి కొత్త ఉద్యోగంలోకి చేరిన 90 తొలి రోజులతో ఈ మూ డో నవల ‘తీరం చేరిన నావ’ మొదలవుతుం ది. ప్రపంచమే కొత్తపోకడలు పోతున్న కాలం అది. ఇంధన హృదయాలున్న మనుషులకు ఆశాభంగాలను, ఆవేశాలను రగలించిన కా లం. మలిదశ తెలంగాణ ఉద్యమానికి వేదికలు రాజుకుంటున్న సమయం కూడా. సు మారు పాతికసంవత్సరాల సంక్షుభిత కాలం లో స్వామి, ఆయనతో పాటు ప్రపంచం చేసిన ప్రయాణం, ఈ నవలలో చదవవచ్చు. ‘సలాం హైదరాబాద్ ‘ నుంచి కూడా లోకేశ్వర్ కథాకాలానికి ముందు నడుస్తూ సింహా వలోకనం చేస్తారు.
రచనాకాల ప్రభావం మూడు నవలల్లోనూ కనిపిస్తుంది. అనుభవంలోను, అధ్యయనంలోను, పరిశీలనంలో ను సమకూర్చుకున్న అవగాహనల నుంచి చారిత్రకంగా కథనం చేస్తారు. మూడింటిలో చివరి రెండు నవలలు తెలంగాణ రాష్ట్రం ఏ ర్పడిన తరువాత రాసినవే. వాటిలో పంక్తుల మధ్యదాగినఅర్థాన్ని చదవగలిగితే, లోకేశ్వర్ రాయని, బహుశా రాయడం ఇష్టం లేని నాలుగోభాగాన్ని కూడా కొంత అర్థం చేసుకోవచ్చు.
వెదురు లాగా చిల్లులు పడిన ఎడద కూడా సుస్వరాలను వినిపిస్తుందని, లోకేశ్వర్ నవల అటువంటి సుస్వరాలు పలికిందని సదాశివ ‘సలాం హైదరాబాద్’ ముందు మాటలో అన్నారు. మలిదశ తెలంగాణ ఉద్య మం తనను తాను కూడగట్టుకుంటున్నదశలోనే లోకేశ్వర్ ఆ నవల రాశారు. తెలం గాణకు గుండెకాయ అయిన హైదరాబాద్ గురించి, ఉద్యమ నేపథ్యంలో చర్చ జరుగుతున్నప్పుడు, తనకు ఆ నవల రాయాలనిపిం చిందని లోకేశ్వర్ చెప్పారు. అంతమాత్రమే కాదు, ఈ నవల ద్వారా తొలి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం నుంచి ఒక అంతఃస్రవంతి సజీవంగా ఉన్నదని, మరింత వెనుకకు వెడితే ఆ పరంపర మూలాలు గతచరిత్రలో కనిపిస్తాయని ఆ నవల గుర్తు చేసింది.
అస్తిత్వ చైత న్యంతో, ప్రాంతీయ, స్థానీయ అటానమీల భావనలతో ముందుకు వచ్చిన మలిదశ ఉ ద్యమం తీర్చిదిద్దుతున్న ఒక చారిత్రక కథనానికి ‘సలాం హైదరాబాద్’ సృజనాత్మక కాల్ప నిక కథారూపం ఇచ్చింది. కథ, నవల వంటి కాల్పనిక సాహిత్య ప్రక్రియలు చారిత్రక చలనాలను, మానవ స్పందనలను ప్రభావవం తంగా చూపగలుగుతాయి.
జీవన ప్రయాణంతో మేళవించి..
ఇటీవలి చరిత్రను, రచయిత లేదా కథానాయ కుడి జీవన ప్రయాణంతో మేళవించి రాసిన నవలలివి. అనేక అలజడులు అంటున్నామంటే, అన్నీ కలవరపు అలజడులే కాదు, సామాజిక జీవిగా జయాపజయాల స్వీకరణలో కలిగిన భావోద్వేగాలే కాదు, ఒక ప్రేమికుడిగా, సహచరుడిగా, స్నేహితుడిగా, తండ్రిగా, కుమారు డిగా, రకరకాల వ్యక్తిగత పాత్రల నిర్వహణలలో అనుభవించిన ఆనందాతిరేకాలు కూడా! తన సహచరితో, పిల్లలతో, తల్లిదండ్రులతో, సోదరులతో పంచుకున్న జీవితం విశేషాలు ఈ రచనకు వ్యక్తిగత, మానవీయ పరిమళాన్ని అందించడమే కాదు, నవలకు అవసరమైన కాల్పనిక ఛాయను అందించాయి.
స్వామి ని అతని స్థానిక, సామాజిక నేపథ్యాలు, ఉద్యమస్పర్శలు తీర్చిదిద్దాయి. భావావేశం కలిగినవాడు. హేతువాది. న్యా యభావనకు ఆకర్షితుడు. సామాజిక ఆధిపత్యాల విషయంలో ప్రతిఘటనాశీలి. జీవిత సహచరి, పిల్లల విషయంలో ప్రజాస్వామికంగా, ప్రేమాస్పదంగా, ఆదర్శవంతమైన నడవడితో కనిపిస్తాడు. కానీ, సాధారణ స్త్రీపురుష సంబంధాల విలువలలో మాత్రం స్వామి ఆలోచనా విధానంలో సమతుల్యత కనిపించదు ఒకేరకమైన ‘తప్పులు’ చేసిన మిత్రులలో ఆడవారికి, మగవారికి వేరువేరు పరిగణనలు ఇవ్వడం కనిపిస్తుంది.
కొందరు స్త్రీ ఉద్యోగుల విషయంలో, ఉద్యోగ ఉద్యమంలో స్త్రీ నేతల విషయంలో -సమాజం లోని సామాన్యులు చేసే పద్ధతిలో అంతగా కఠినమైన.అవాంఛనీయమైన వ్యాఖ్యలు చేయకుండా ఉండవలసింది .అవి రచనలో పాటించిన ఇతర ప్రమాణాలకు ఎడంగా, భిన్నంగా కనిపిస్తాయి. ఆ అధ్యాయాలు నవలకు అత్యవసరమైనవి కూడా కావు. మొత్తం మీద, స్వామికి నైతిక దృష్టి ఎక్కువ. తాను విశ్వసించిన విలువలతో సన్నిహిత మిత్రులను కూడా తూకం వేస్తాడు.
కొత్త కర్తవ్యాల స్ఫురణ
తెలంగాణ ఉద్యమాలు ఇతివృత్తంగా కా ల్పనికవచన సాహిత్యం అతి తక్కువగా వ చ్చింది. సాయుధపోరాట ఇతివృత్తంగా వచ్చి న నవలల్లో ప్రాంతేతరులు రాసినవే ఎక్కువ. 1970లలో ప్రారంభమైన కొత్త విప్లవోద్యమ వెల్లువలో తెలంగాణ నవలాకారులే అత్యధికంగా కనిపిస్తారు. తెలంగాణ సాయుధ రై తాంగ పోరాటాన్ని కాల్పనిక వచనంలో ప్రతిబింబింపజేయడానికి వట్టికోట ఆళ్వారు స్వామి ఒక వరుస నవలల ప్రణాళికనే తలపెట్టారు. ఉద్యమ దశలను బట్టి నవలలు రాయాలనుకున్నారు.
ఆరంభ దశను ‘ప్రజల మనిషి’ చిత్రించగా, మలి, సాయుధ దశను అసంపూర్ణ నవల ‘గంగు’ కథనం చేసింది. ఏ ఉద్యమనవలలైనా సమకాలంలో కాక, అనంతరదశలోనే కాల్పనిక వచనంలోకి ఎక్కడం మనం చూస్తాం. జాతీయోద్యమ నవలలు కూడా అంతే. లోకేశ్వర్ నవలలు కూడా అదే బాటలో నడిచాయి. కాకపోతే, గతంలోని ఉ ద్యమనవలలు చరిత్రను నమోదు చేయడానికి, ప్రేరణలను నిలపడానికి ఉద్దేశిస్తే, లోకేశ్వ ర్ నవలలకు ఆప్రయోజనంతో పాటు, సమకాలీన ప్రాసంగికత అధికపాళ్లలో సమకూరిం ది.
తొలిదశ తెలంగాణ పోరాటంలో ఉద్యమ కవిత్వం వచ్చింది కానీ, రెండో దశతో పోల్చుకుంటే తక్కువే. మలిదశలో పాట నాయకపా త్ర పోషించింది. సాహిత్యసాంస్కృతికోద్య మం ఉధృతంగా, సమాంతరంగా సాగింది కాబట్టి, వచన కవిత్వం కూడా గణనీయంగా వచ్చింది. పరిశోధనారంగం లో, వ్యాసరచనలో కృషి బాగా జరిగింది. నవలలు మాత్రం తగినన్నిరాలేదు. పెద్దింటి అశోక్‌కుమార్ ‘లాంగ్ మార్చ్’, పి.చంద్ ‘తెలంగాణ తల్లి’, ‘సకలజనుల సమ్మె’, ‘ధిక్కార కెరటం’.. ఇట్లా కొన్ని మాత్రమే వచ్చాయి.
అవన్నీ తెలంగాణ ఉద్యమాన్ని గొప్పగా చిత్రించాయి, ప్రభావితం చేశాయి, రికార్డు చేశాయి. లోకేశ్వర్ నవలాత్రయం, ఒక వ్యక్తి జీవిత ప్రయాణాన్ని, ఒక 40 ఏళ్ల తెలంగాణ కాలాన్ని, ఒక ఉద్య మం నుంచి మరో ఉద్యమానికి వంతెన కడు తూ, పెద్ద కేన్వాసు తీసుకుని చేసిన రచన. రచయిత ఎంచుకున్న కథన పద్ధతి, కాలవిస్తృతి, చారిత్రక, సాంస్కృతిక అంశాల కలనేత ఈ నవలలను భిన్నమైన కోవలో నిలబెట్టాయి.
‘కల్లోల కలలకాలం’తో పాటు, ‘తీరం చేరిన నావ’ మరుగున, మరపున పడిపోతున్న ఉ ద్యమ జ్ఞాపకాలను, క్రమాన్ని, త్యాగాల చరిత్రను జ్ఞాపకం చేసి, కొత్త తరాలకు పరిచయం చేసి, కొత్త కర్తవ్యాలను స్ఫురింపజేస్తాయి. ఆత్మీయ ఉద్వేగాల తో, సామాజిక ఉద్యమావేశాలతో పాఠకులను ప్రయాణ సహచరుల ను చేసుకోగలిగిన రచన ఇది!