16-08-2025 02:27:41 PM
ఇల్లెందు/టేకులపల్లి (విజయక్రాంతి): ఇల్లందు నియోజకవర్గం(Yellandu Constituency)లోని ఇల్లందు, టేకులపల్లి మండలాల్లో శుక్రవారం రాత్రి కుండపోతగా వర్షం కురిసింది. దీనితో వాగులు, వర్రెలు పొంగి ప్రవహిస్తున్నాయి. పలు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. చెరువులు నిండుకొని అలుగులు పడ్డాయి. ఇల్లందు - మహబూబాబాద్ మార్గంలోని జెండాలవాగు వద్ద వాగు రోడ్డు పైనుంచి నీరు ప్రవహించడంతో రాకపోకలు నిలిచి పోయాయి. ఇల్లందులపాడు చెరువు నిండుకొని అలుగు ప్రవాహంతో పట్టణంలోని ఒకటవ వార్డు సత్యనారాయణపురంకు రాకపోకలు నిలిచాయి. టేకులపల్లి మండలంలో పెద్దవాగు, రాళ్లవాగు, ముర్రేడు వాగు, తెల్లవాగు, తదితర వాగులు పొంగి ప్రవహించాయి.
టేకులపల్లి - తావుర్యతండా గ్రామాల మధ్య, పాతతాండా - రాంపురం గ్రామాల మధ్య, తుర్పుగూడెం - స్టేషన్ బేతంపూడి గ్రామాల మధ్య వాగుల ఉధృతితో రాకపోలు నిలిచాయి. రాత్రంతా కుండపోతగా కురియడంతో ఎలాంటి ప్రమాదాలు జరగలేదు. పరికలవాగు చెరువు, తెల్లవాగు చెరువు, సాయమ్మ చెరువు, బేతంపూడి ప్రాజెక్ట్, మంచి నీళ్ల చెరువులు నిండుకున్నాయి. మంచినీళ్ల చెరువు వద్ద అలుగు ప్రవాహంతో చెరువులోని చేపలు పోతుంటే బేతంపూడి గ్రామస్తులు అలుగువద్ద వలలతో చేపలను వేటాడారు. ఈ ఏడాదిలో కురిసిన వర్షాల్లో ఇదే అతి పెద్ద వర్షమని రైతులంటున్నారు.