calender_icon.png 29 May, 2025 | 4:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామాల్లో చెరువును తలపిస్తున్న.. వీధులు

28-05-2025 08:31:52 AM

నూతన డ్రైనేజీల నిర్మాణం కొరకు నిధులు మంజూరు చేయాలి.

వీధిలో నీరు చేరి దుర్గంధంతో పాటు.. రోగాలు

తుంగతుర్తి, విజయక్రాంతి: గత కొన్ని సంవత్సరాలుగా సూర్యాపేట జిల్లా(Suryapet District) తుంగతుర్తి మండల కేంద్రంతో పాటు వెంపటి తదితర గ్రామాల్లోని వీధుల్లో, అధికార నిర్లక్ష్యంతో నూతన డ్రైనేజీలు నిర్మించకపోవడంతో ఒక ప్రక్క వీధివాసులు ఇండ్ల నుంచి వెళ్లే మురుగునీరు, మరొక ప్రక్క వర్షపు నీరు వీధుల్లోకి రావడంతో చిన్న వర్షానికి చెరువు లాగా తలపిస్తున్నాయి. దీనితో ఎక్కడ నీరు అక్కడే చేరి దుర్గంధంగా మారి, దోమలు వృద్ధి చెంది రోగాల బారిన పడుతున్నామని వీధి ప్రజలు, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గత పాలకులు డ్రైనేజీల నిర్మాణం కొరకు ప్రత్యేక నిధులు ఏర్పాటు చేయకపోవడం, ప్రస్తుత పాలకులు కూడా పూర్తిస్థాయిలో నిధులు మంజూరు చేయకపోవడంతో ఎక్కడ వేసిన గొంగడి అక్కడే చందంగా మారి ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. వెంపటి చెరువు సమీపంలో గల వీధుల్లో గతంలో వేసిన సిసి రోడ్లు పూర్తిగా మట్టిలో కనుమరుగయ్యాయి. నేడు ఆ ప్రాంత వీధులు డ్రైనేజీలు లేకపోవడంతో మురికి నిలువ ఉండి, దోమలు వృద్ధి చెంది ఒక కుటుంబంలో డెంగ్యూ వ్యాధి కూడా సోకినది .అయినప్పటికీ సంబంధిత అధికారుల నిర్లక్ష్యంతో నేటి వరకు కూడా ఆ వీధిలో ఎటువంటి అభివృద్ధి పనులు చేపట్టక పోయారు. మండలంలోని గ్రామాలు అభివృద్ధి చెందాలంటే ప్రతి గ్రామంలో వీధుల్లో డ్రైనేజీ, సిసి రోడ్ల నిర్మాణం చేపట్టవలసిన ఆవశ్యకత ఉందని వివిధ పార్టీ నాయకులు ప్రజలు కోరుతున్నారు.