22-10-2025 11:03:29 PM
జన్ సేవా సంఘ్ అధ్యక్షుడు ఆర్.ఆర్.సింగ్..
ముషీరాబాద్ (విజయక్రాంతి): లోక కల్యాణార్థం, ప్రపంచ శాంతి కోసం ఉత్తర భారత దేశంలో జరుగుతున్న మాదిరిగానే ఈనెల 27, 28 తేదీలలో హైదరాబాద్ జిల్లాలోని 29 ఘాట్ లో ఛట్ పూజ పండుగను పురస్కరించుకుని పెద్దఎత్తున సూర్య భగవానుడిని పూజించే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని జన్ సేవా సంఘ్ తెలిపింది. ఈ మేరకు బుధవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంఘ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆర్.ఆర్.సింగ్, రాజీవ్ రంజన్ చౌబే, కోశాధికారి బినిత్ కుమార్ మాట్లాడారు. గత 18 ఏళ్లుగా ఈ ఛట్ పూజ కార్యక్రమాన్ని హైదరాబాద్ జిల్లాలో నిర్వహిస్తున్నామని వారు తెలిపారు.
ముఖ్యంగా 27 తేదీ సాయంత్రం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు, 28వ తేదీన ఉదయం 4 గంటల నుంచి 7 గంటల వరకు ఛట్ పూజ కార్యక్ర-మాలు జరుగుతాయని అన్నారు. నెక్లెస్ రోడ్ లో జరిగే కార్యక్రమంలో ఒక లక్ష మంది భక్తులు హాజరవుతారని, ముఖ్య అతిధులుగా కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రు లు, అన్ని పార్టీల నేతలు పాల్గొంటారని తెలిపారు. ఈ ఛట్ పూజ కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని సూర్య భగవానుడి ఆశీస్సులు పొందాలని సూచించారు. భక్తులకు ఉచితంగా ప్రసాదాన్ని పంపిణీ చేస్తామన్నారు. గత కొన్ని సంవ-త్సరాలుగా భారతీయ సంస్కృతిని పరిరక్షిస్తూ పేద ప్రజలకు చేయూతను అందిస్తున్న తమ జన్ సేవా సంఘ్ కార్యాలయం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం 2 ఎకరాల భూమిని కేటాయించాలని వారు సిఎంకు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో సంఘ్ నాయకులు మున్నావర్, రమేష్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.