calender_icon.png 23 October, 2025 | 2:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కల్తీ కల్లులో కలిపే రసాయనాలు మనుషుల మరణానికి దారితీస్తున్నాయి

22-10-2025 11:18:38 PM

మత్తు కల్లుకు బానిసై నిండు ప్రాణం బలి

కల్తీ కల్లు మత్తులో యువకులు

కలవర పడుతున్న తల్లితండ్రులు

పాపం, 19 ఏళ్ల పసివాడు బలి, ఈ కల్తీకి, ఇంకేదరో, యువకులు

ఆ కల్తీ దుకాణం దందా జోరు, త్రాగిన యువకులు, మృత్యువాత పడుతున్నారు

ఎల్లారెడ్డి (విజయక్రాంతి): కల్లు తాగుదామని వెళ్తే కాటికి పంపేశారు.. ఏమేం కలుపుతున్నారో తెలుసా..! కల్తీ కల్లు ప్రాణాలు తీస్తుందని తెలిసినా.. చాలా మంది దానికి అలవాటు పడి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. తక్కువ ధరకే దొరుకుతుండటంతో కల్లు కాంపౌండ్‌లలోకి వెళ్లి ఆ కల్తీ కల్లు, రసాయనాలు కలిపిన కల్లు తాగి.. ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నారు. కల్తీ కల్లు తాగి ప్రాణాలు కోల్పోతున్నా పరిస్థితిలో మాత్రం మార్పు రావడం లేదు. సహజంగా చెట్ల నుంచి వచ్చే కల్లులో రసాయనాలు, నీళ్లు, ఇతర పదార్థాలు కలిపి భారీ మొత్తంలో తయారు చేసి కల్లు కాంపౌండ్‌లలో విక్రయిస్తున్నారు. ఇలాంటి కల్లు తాగడం వల్ల అవయవాలు పనిచేయకుండాపోయి ప్రాణాంతకంగా మారుతోంది.

సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో కల్లు తాగడం చాలా మందికి ఒక అలవాటుగా ఉంటుంది. కేవలం మత్తు కోసమే కాకుండా.. కల్లులో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయని చెబుతూ ఉంటారు. అందుకే ఊర్లలో కల్లు తాగడం అనేది పెద్ద సమస్యగా, వింతగా చూడరు. కానీ పట్టణ ప్రాంతాలకు వచ్చేసరికి స్వచ్ఛమైన కల్లు దొరకడం చాలా కష్టం. కల్లులో రసాయనాలు, ఇంకా వేరే వేరే పదార్థాలు కలిపి.. కల్తీ చేసి.. కల్లు కాంపౌండ్‌లలో విక్రయిస్తున్నారు. ఇదే ఇప్పుడు నగరవాసుల ప్రాణాలపైకి తీసుకువస్తోంది. కల్తీ కల్లు తాగి.. అస్వస్థతకు గురి కావడం, దానికి అలవాటై అనారోగ్యం పాలు కావడం, చివరికి ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు కూడా చోటు చేసుకోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కల్తీ కల్లు తాగి చనిపోయిన సంఘటనలు వెలుగుచూసిన ప్రతీసారి.. అధికారులు హడావుడి చేసినా.. పరిస్థితిలో మాత్రం మార్పు రావడం లేదు.

కల్తీ కల్లును ఎలా తయారు చేస్తారు. ఎలాంటి పదార్థాలు కలుపుతారు..?

క్లోరల్ హైడ్రేట్

క్లోరల్ హైడ్రేట్ అనేది ఒక రకమైన మత్తుమందు. సహజమైన కల్లులో ఈ క్లోరల్ హైడ్రేట్‌ను కలపడం వల్ల.. అది తాగిన వారికి.. తక్కువ సమయంలోనే మైకం కమ్ముతుంది. దీంతో వారికి నిద్ర వస్తుంది. ఇలా కల్లులో క్లోరల్ హైడ్రేట్ కలపడం వల్ల.. కాలేయం, కిడ్నీలు, నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది.

డైజోఫామ్

డైజోఫామ్ అనేది ఒక ట్రాంక్విలైజర్. సాధారణంగా ఆందోళనను తగ్గించడానికి, కండరాలను సడలించడానికి ఈ డైజోఫామ్‌ను ఉపయోగిస్తారు. కల్లులో ఈ డైజోఫామ్‌ను కలిపినప్పుడు.. అది తాగినవారికి మత్తును పెంచుతుంది.

ఆల్ప్రజోలం 

ఈ ఆల్ర్పజోలం అనేది కూడా ప్రమాదకరమైన మందు. దీన్ని నిషేధించినప్పటికీ మార్కెట్లో దొరుకుతూనే ఉంది. ఈ ఆల్ర్పజోలంను కల్లులో కలిపినప్పుడు తీవ్రమైన మగతను కలిగిస్తుంది.

ఓపియం, నల్లమందు:

ఓపియం అని పిలిచే నల్లమందును కూడా కల్లులో కలిపి కల్తీ చేస్తారు. కల్లులో ఈ ఓపియంను కలిపినప్పుడు తీవ్రమైన మత్తు, బద్ధకం కలుగుతాయి.

మెథనాల్

మెథనాల్ అనేది అత్యంత ప్రమాదకరమైన పదార్థం. ఇది ఒక ఇండస్ట్రీయల్ ఆల్కహాల్. చాలా తక్కువ మోతాదులో మెథనాల్‌ను తీసుకున్నా అది ప్రాణాంతకంగా మారుతుంది. కల్లుకు రంగు, వాసన, వేగంగా మత్తును కలిగించేందుకు మెథనాల్‌ను కలుపుతారు.

బెంజాయిక్ యాసిడ్ 

కల్లు పాడు కాకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంచడానికి బెంజాయిక్ యాసిడ్‌ను కలుపుతారు.

ఈస్ట్ 

కల్లును త్వరగా పులిసి పోయేలా చేసి.. ఆ తర్వాత ఎక్కువ ఆల్కహాల్ ఉత్పత్తి అయ్యేలా చేయడానికి కలుపుతారు.

పెయింట్స్, బ్యాటరీ యాసిడ్స్:

కొన్ని సందర్భాల్లో కల్లుకు ప్రత్యేక రంగు, రుచి, మత్తును కలిగించడానికి పెయింట్లలో వాడే రంగులు, బ్యాటరీ ఆమ్లాలను కూడా కలుపుతారని తెలుస్తోంది. అయితే పెయింట్లు, బ్యాటరీ యాసిడ్స్ అత్యంత ప్రమాదకరమైనవి అని డాక్టర్లు చెబుతున్నారు. మరోవైపు.. తక్కువ నాణ్యత గల కల్లు రుచిని పెంచడానికి చక్కెర, బెల్లం వంటివి కలుపుతారు.

కల్తీ కల్లు వల్ల ఎందుకు చనిపోతారు?

కల్తీ కల్లులో కలిపే రసాయనాలు మనుషుల మరణానికి దారితీస్తాయి. లేదా దీర్ఘకాలికంగా శరీరంలోని అవయవాలను పూర్తిగా దెబ్బతీసి మృతికి కారణం అవుతాయి.

మెథనాల్ వల్ల నష్టాలు

కల్లులో కలిపే మెథనాల్ అనే యాసిడ్ అత్యంత ప్రధానమైన కారణం. మనుషుల శరీరంలోకి మెథనాల్ వెళ్లినప్పుడు మెటబలైజ్ అయి ఫార్మిక్ యాసిడ్, ఫార్మాల్డిహైడ్‌గా మారుతుంది. ఇవి శరీర కణజాలాలను.. ముఖ్యంగా మెదడు, కళ్లు, కాలేయం, కిడ్నీ కణాలను తీవ్రంగా దెబ్బతీస్తాయి. దీనివల్ల తీవ్రమైన జీవక్రియ సంబంధిత ఆసిడోసిస్ ఏర్పడుతుంది. అంతేకాకుండా దృష్టి కోల్పోవడం (అంధత్వం) సంభవించే ప్రమాదం ఉంది. వీటితోపాటు కిడ్నీ ఫెయిల్ అవుతుంది. శ్వాసకోశ సంబంధిత వ్యాధులు, గుండె ఆగిపోవడం జరిగి వెంటనే మరణం సంభవిస్తుంది.

క్లోరల్ హైడ్రేట్, డైజోఫామ్ వంటి వాటిని అధిక మోతాదులో కల్లులో కలపడం వల్ల కేంద్ర నాడీ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటుంది. దీనివల్ల శ్వాస తగ్గిపోవడం, బీపీ తగ్గడం, కోమాలోకి వెళ్లడం, మరణం సంభవిస్తుంది. కాలేయం, కిడ్నీలపైనా వీటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దీర్ఘకాలికంగా కల్తీ కల్లును తాగడం వల్ల కాలేయం, కిడ్నీలు, గుండె, మెదడు వంటి ముఖ్యమైన శరీర అవయవాలు మెల్ల మెల్లగా దెబ్బతిని.. చివరికి అవి విఫలమై మరణానికి కారణం అవుతాయి.

కల్తీ కల్లు వల్ల దుష్ప్రభావాలు:

కల్తీ కల్లు తాగడం వల్ల మనుషులకు చాలా దుష్ప్రభావాలు ఉంటాయి. కొందరికి వెంటనే మరికొందరికి దీర్ఘకాలంలో ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. ఈనెల 6, 7వ తేదీల్లో హైదరాబాద్ నగరంలోని కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ, బాలానగర్, హయూదర్‌నగర్, శంషీగూడ పరిసర ప్రాంతాల్లోని పలు కల్లు దుకాణాల్లో కల్తీ కల్లు సేవించిన దాదాపు 50 మందికి పైగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిలో 9 మంది ఇప్పటివరకు మృతి చెందారు. కల్లులో ఆల్ఫ్రాజోలం అనే సైకోట్రోపిక్ పదార్థం కలిపినట్లు అధికారులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. దీనివల్ల ఆ కల్తీ కల్లు తాగిన వారికి వాంతులు, అతిసారం, తలతిరగడం, కిడ్నీ వైఫల్యం వంటి తీవ్రమైన లక్షణాలు కనిపించాయని.. చాలా మందికి డయాలసిస్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని డాక్టర్లు తెలిపారు. ఈ ఘటనతో రంగంలోకి దిగిన పోలీసులు.. ప్రధాన నిందితుడు కూన సత్యం గౌడ్‌ సహా ఐదుగురిని అరెస్ట్ చేశారు. కల్తీ కల్లు విక్రయించిన 5 కల్లు దుకాణాల లైసెన్సులను సస్పెండ్ చేశారు. బాలానగర్ ఎక్సైజ్ ఎస్‌హెచ్ఓ వేణుకుమార్‌ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.

కామారెడ్డి కల్తీ కల్లు ఘటన

కామారెడ్డి జిల్లాలో ఈ ఏడాది ఏప్రిల్ నెలలో కల్తీ కల్లు సేవించి.. 100 మందికి పైగా ఆస్పత్రిలో చేరడం అప్పట్లో సంచలనంగా మారింది. ఆ ఘటనలో కూడా కల్లులో ఆల్ఫ్రాజోలం కలిపినట్లు అధికారులు ప్రాథమికంగా అనుమానం వ్యక్తం చేశారు.

కల్తీ కల్లు.. బుధవారం 19 ఏళ్ల యువకుడు మృతి

ధ్యాకమొల్ల కుమార్, కల్తీ కల్లుకు బలి..

తాజాగా కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి నియోజకవర్గ నాగిరెడ్డిపేట మండలంలో, రాఘవపల్లిలో జరుగుతున్న కల్తీ కల్లు విషయం వెలుగుచూసిన కల్తీ కల్లు ఘటన మరోసారి.. చర్చకు దారితీసింది. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని నాగిరెడ్డిపేట మండలం తాండూరు గ్రామానికి చెందిన ధ్యాకమొల్ల కుమార్, తండ్రి సంగయ్య, యువకుడు వయస్సు,19 సంవత్సరాలు, వృత్తి, కులీ మృతుడి చావుకి కారణమే అని పరిసర ప్రాంతంలోని ప్రజలు, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మద్యానికి బానిసై,కల్తీ కల్లు తాగి కుటుంబ సభ్యులను తరుచూ బాధపెట్టేవాడు. మృతిడికి పెళ్లి కాలేదు. మృతుడికి అన్న నాగరాజు, హైదారాబాద్ లో కూలి పనులు చేసుకుని జీవిస్తాడు. మృతుడి మరణంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నట్లు స్థానికులు తెలిపారు.

కనీసం అధికారులు ఇకనైనా యువకులను మత్తుకు అలవాటు పడకుండా కల్తీ కల్లు కాటుకు మృత్యువాత పడకుండా కాపాడాలని గ్రామస్తులు ప్రజలు వేడుకుంటున్నారు. కల్తీ కల్లు విక్రయిస్తున్న దుకాణ యజమానులపై ప్రత్యేక చర్యలు చేపట్టి ప్రజలను కాపాడవలసిన అధికారం ఆప్కారి శాఖకు ఉన్నదని, గ్రామాలలో చెట్లనుండి గీసిన కల్లు కరువై చెత్త కంపెనీల నుండి కెమికల్ ద్వారా రసాయనాలు తీసుకొచ్చి మత్తుకు యువతను బానిసను చేస్తూ కాసులు జమ చేసుకుంటూ ప్రజల ప్రాణాల ఉసురు పోసుకుంటున్న, కల్తీ కల్లు విక్రయదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు మండిపడుతున్నారు.