16-07-2025 12:46:09 AM
జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్
హత్నూర(సంగారెడ్డి), జూలై 15(విజయక్రాంతి): సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని, నాసిరకం పదార్థాలు వండితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ అధికారులను హెచ్చరించారు. మండల కేంద్రమైన హత్నూరలోని గురుకుల పాఠశాలను ఆయన మంగళవారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ గురుకుల పాఠశాలలోనీ విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాలల్లోని వంటగది, స్టోర్ రూమ్ , డైనింగ్ హాల్ పరిశీలించారు. వసతి గృహంలో విద్యార్థులకు వడ్డిస్తున్న భోజనం నాసిరకంగా ఉండడంతో సంక్షేమ అధికారి మోహన్ నాయక్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
వసతి గృహం పరిసరాలు పరిశుభ్రంగా లేకపోవడం భోజనం నాణ్యత లోపించడం , గురుకుల పాఠశాల భవనం మరమ్మతులు చేపట్టకపోవడంపై అదనపు కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. విద్యార్థులకు నూతన మెనూ ప్రకారం నాణ్యమైన వస్తువులతో రుచికరమైన ఆహారాన్ని అందించాలని సిబ్బందికి ఆదేశించారు.
విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలని సిబ్బందికి సూచించారు . వెంటనే గురుకుల పాఠశాల ఆవరణ పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది ఉపాధ్యాయులు విద్యార్థులుపాల్గొన్నారు.