12-05-2025 01:36:09 AM
ఓ ఇన్‌ఫ్లూయెన్సర్ చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ ‘హాయ్.. అపూ్పు ఎలా ఉన్నావ్..?’ అంటూ ఓ మహిళ ప్రశ్న.
వెంటనే అప్పూ గుక్కతిప్పుకోకుండా మాట్లాడడం మొదలుపెడుతుందిలా.. ‘నేను బాగున్నాను ఆంటీ. నేనేదీ ఉచితంగా చేయట్లేదు. నేనేం చేస్తున్నానో చెప్పాలంటే రూ.2 వేలు తీసుకుంటాను.
ఏం చేయాలనుకుంటున్నానో చెప్పాలంటే రూ.3 వేలు తీసుకుంటాను.
నేనేం చేయాలో మీరు చెప్పాలంటే రూ.5 వేలు తీసుకుంటాను.
నేను లావయ్యాను. కలర్ తగ్గాను.. అనే నాకు తెలిసిన విషయాలు చెప్పాలనుకుంటే.. రూ.8 వేలు చార్జ్ చేస్తాను.
ఇక నేనెప్పుడు పెండ్లి చేసుకోవాలి? ఎలాంటి వాడిని పెండ్లాడాలి? అని.. దిక్కుమాలిన సలహాలు ఇవ్వాలంటే..మాత్రం రూ.25 వేలు తీసుకుంటాను.
నన్ను మీ పిల్లలతో పోల్చి.. మా తల్లిదండ్రులకు చాడీలు చెప్పాలంటే.. రూ.30 వేలు తీసుకుంటాను.
పిల్లల్ని ఎలా పెంచాలి..? అనే విషయంపై మా అమ్మానాన్నకు చెప్పాలంటే మాత్రం రూ.50 వేలు తీసుకుంటాను. మా తల్లిదండ్రులకు మొహమాటం. అందుకే నేనే ముందు చెప్పేస్తున్నా.
ఇక.. నా జీతం ఎంత? నేనెక్కడ పెట్టుబడి పెడుతున్నాను? నా భవిష్యత్తు ప్రణాళికలు ఎంటి? అని తెలుసుకోవాలనుకుంటే రూ.25 వేలు చార్జ్ చేస్తాను. ఇప్పుడు చెప్పండి ఆంటీ.. ఏ ప్రశ్నతో మొదలుపెడదాం..’ అని అప్పు చెప్పడం పూర్తి కాగానే.. అవతలి నుంచి ప్రశ్న అడుగుతున్న మహిళ.. ‘అయినా.. నీ వ్యక్తిగత విషయాలు నాకెందుకులే? చూస్తుంటే నువు తెలివైన దానిలో ఉన్నావు.
ఉంటానమ్మా.. అప్పు’ అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అంతే ఈ రీల్.. తన కుటుంబం, తమ పిల్లల సంరక్షణ, తమ జీవితం గురించి పట్టించుకోకుండా ఎదుటి వారి జీవితంపై ఆసక్తి చూపిస్తూ, ఉచిత సలహాలిచ్చే వారికి ఈ రీల్ మంచి కౌంటర్. ఎవరిపని వారు చూసుకుంటే బెటర్ అన్నది రీల్ సందేశం. ఇంతకీ.. ప్రశ్న అడిగిన ఆంటీ, వెంటనే కౌంటర్ ఇచ్చిన అప్పూ.. పాత్రలు రెండు ఒక్కరే చేయడం విశేషం. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.