05-12-2025 06:54:01 PM
సిపి గౌస్ ఆలం
కరీంనగర్ క్రైం,(విజయక్రాంతి): గ్రామ పంచాయతీ ఎన్నికలను నిష్పక్షపాతంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పటిష్ట చర్యలు చేపట్టినట్లు కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌడ్స్ ఆలం తెలిపారు. శుక్రవారం కమిషనరేట్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో కరీంనగర్ రూరల్, హుజురాబాద్ డివిజన్ లోని ఉన్నతాధికారులు, క్లస్టర్ ఇంచార్జిలు, రూట్ ఇంచార్జులు, గ్రామ పోలీసు అధికారులందరితో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ కమీషనరేట్ పరిధిలోని కరీంనగర్ రూరల్, హుజురాబాద్ డివిజన్లలోని 15 పోలీసు స్టేషన్ల పరిధిని పోలింగ్ కేంద్రాలకు అనుగుణంగా విభజించామని తెలిపారు. ఎన్నికల ప్రారంభం అయ్యేవరకు క్షేత్రస్థాయిలో మొత్తం 508 మంది పోలీసు అధికారులు నిరంతరంగా విధులు నిర్వహించేలా చర్యలు తీసుకున్నామన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించకుండా ఉండేందుకు, కమిషనరేట్ పరిధిలోని రౌడీ షీటర్ల బైండోవర్లను పూర్తి చేశామని తెలిపారు.
వారి కదలికలపై నిరంతరం నిఘా ఉంచేలా ప్రత్యేక చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఎన్నికలు ప్రశాంతంగా, విజయవంతంగా ముగిసేందుకు ప్రజలు, రాజకీయ పార్టీల ప్రతినిధులు పోలీసు అధికారులకు పూర్తిగా సహకరించాలని సీపీ కోరారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీలు వెంకటరమణ, భీంరావు, ఏసీపీ లు శ్రీనివాస్ జి, వేణుగోపాల్, వాసాల సతీష్ లతో పాటు ఇన్స్పెక్టర్లు, అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.