25-08-2025 07:30:04 PM
కామారెడ్డి,(విజయక్రాంతి): డిప్యూటేషన్ పై పంపించిన పీఈటీ ఉపాధ్యాయున్ని తిరిగి రప్పించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ధర్నా నిర్వహించిన సంఘటన సోమవారం కామారెడ్డి మండలం చిన్న మల్లారెడ్డి బాలుర ఉన్నత పాఠశాలలో చోటు చేసుకుంది. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ.. రెండున్నరేళ్లుగా మాకు పీఈటీ ఉపాధ్యాయుడు లేడన్నారు. గతంలో ఇక్కడున్న శివరామ్ అనే పీఈటీ ఉపాధ్యాయున్ని డిప్యుటేషన్ మీద హైదరాబాద్ పంపించారన్నారు. దీంతో అప్పటి నుంచి మాకు క్రీడలు ఆడించే వారే లేరని వాపోయారు.
వెంటనే అతని డిప్యూటేషన్ రద్దు చేసి మా ఉపాధ్యాయున్ని మాకు పంపించాలని డిమాండ్ చేశారు. పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడు లేకపోవడంతో క్రీడలు లేక చాలా నష్టపోతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదర్శ పూర్వ విద్యార్థుల కమిటీ తరపున గత మూడు నెలల నుండి కలెక్టర్, డీఈఓ లను కలిసి విన్నవించినా ఎలాంటి ఫలితం లేదని తెలిపారు.
అధికారులు పట్టించుకోకపోవడంతో సమస్య పరిష్కారానికి నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల్లో క్రమశిక్షణ, మానసిక ఉల్లాసం కలిగి ఉండాలంటే వ్యాయామ ఉపాధ్యాయుడు అవసరమని, ఈ పాఠశాలలో నియమింపబడిన ఉపాధ్యాయుడు ఇక్కడనే పనిచేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదర్శ పూర్వ విద్యార్థుల కమిటీ ప్రతినిధులు కోరారు.