27-05-2025 12:00:00 AM
నిర్మల్, మే 26 (విజయక్రాంతి): జాతీయ స్థాయి బాక్సింగ్ పోటీలకు ఎంపికైన విద్యార్థిని పి.అభినయను కలెక్టర్ అభిలాష అభినవ్ సోమవారం తన ఛాంబర్లో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్తో కలిసి అభినందించారు. ఈ నెల 24 నుంచి 26 వరకు మంచిర్యాల ఎఫ్‌ఏసి ఫంక్షన్ హాల్లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి జూనియర్, సబ్ జూనియర్ యూత్ బాక్సింగ్ పోటీల్లో నిర్మల్ జిల్లాకు చెందిన ఏడుగురు బాక్సర్లు పాల్గొన్నారు.
ఇందులో పి. అభినయ (54-57 వెయిట్ కేటగిరీ), ఎ. కీర్తన (46-48 కేటగిరీ), శ్రావణి (64-67 కేటగిరీ) బంగారు పతకాలు, సిహెచ్. నక్షత్ర (80+ వెయిట్ కేటగిరీ) కాంస్య పతకం సాధించా రు. పతకాలు గెలుచుకున్న అభినయ, కీర్తన జూన్ 4 నుంచి 7 వరకు గోవాలో జరగనున్న జాతీయ స్థాయి జూనియర్ అండ ర్-17 బాలికల బాక్సింగ్ పోటీల్లో ప్రాతినిధ్యం వహించనున్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జాతీయ స్థాయిలో కూడా మంచి ప్రతిభ కనబరిచి జిల్లాకు గర్వకారణంగా నిలవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడల అధికారి శ్రీకాంత్ రెడ్డి, బాక్సింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు.