21-08-2025 06:12:42 PM
జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే..
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంతో పాటు వారి ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే(District Collector Venkatesh Dhotre) అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని జనకాపూర్ లో గల గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాల, వసతి గృహాన్ని ఆకస్మికంగా సందర్శించి విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు పట్టికలు, వంటశాల, భోజన నాణ్యత, విద్యా బోధన విధానం, తరగతి గదులు, పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో గుణాత్మక విద్యను బోధించాలని, ముఖ్యంగా ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్ సబ్జెక్టులపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. తరగతిలో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని తెలిపారు. వచ్చే నెల నాటికి విద్యార్థులలో విద్య అభ్యసన సామర్ధ్యాల పురోగతి లేకుంటే ఉపాధ్యాయులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ప్రభుత్వం విద్యార్థులకు సకల సదుపాయాలు కల్పించి నాణ్యమైన విద్య అందించే దిశగా చర్యలు తీసుకుంటుందని, ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థులకు మెనూ ప్రకారం సకాలంలో పోషక విలువలు కలిగిన ఆహారం, శుద్ధమైన త్రాగునీటిని అందించాలని, వారి ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. ఆహారం తయారీ సమయంలో శుభ్రత నిబంధనలు పాటించాలని, తాజా కూరగాయలు, నిత్యవసర సరుకులు వినియోగించాలని తెలిపారు. వర్షాకాలం అయినందున పాఠశాల, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని, వ్యక్తిగత శుభ్రతపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన సంక్షేమ అధికారి రమాదేవి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.