21-08-2025 06:10:51 PM
ఉట్నూర్ ఐటిడిఏ పీఓ ఖుష్బు గుప్తా..
జన్నారం (విజయక్రాంతి): ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహ విద్యార్థులకు సకల సదుపాయాలతో కూడిన మెరుగైన విద్య అందించాలని ఉట్నూర్ సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు అధికారి ఖుష్బు గుప్తా(ITDA PO Khushboo Gupta) అన్నారు. గురువారం జన్నారం మండల కేంద్రంలోనీ గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాల, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలను సందర్శించి రిజిస్టర్లు, పరిసరాలు, కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు అధికారి మాట్లాడుతూ, ప్రభుత్వం అన్ని ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలలో అన్ని సదుపాయాలు కల్పించి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించే దిశగా చర్యలు తీసుకుంటుందన్నారు.
నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులకు షోకాజు నోటీసు
విద్యార్థులకు మెను ప్రకారం భోజనం అందించడంలో నిర్లక్ష్యం వహించిన డిప్యూటీ వార్డెన్ కు ఐటీడీఏ పీవో ఖుష్బు గుప్తా షోకాజ్ నోటీసు జారీ చేశారు. విధుల పట్ల సమయపాలన పాటించని ఎస్.జి.టి. ఉపాధ్యాయునికి సైతం షో కాజ్ నోటీసు ఇచ్చారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ప్రతి రోజూ మెనూ ప్రకారం పోషక విలువలు గల ఆహారం, శుద్ధమైన త్రాగునీటిని అందించాలని, విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులను ఆదేశించారు. సబ్జెక్టుల వారీగా విద్యార్థులకు అర్ధమయ్యే రీతిలో విద్యాబోధన చేయాలని, తరగతిలో వెనుకబడిన విద్యార్థుల పట్ల ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. వర్షాల నేపథ్యంలో దోమల వలన వ్యాపించే డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు ప్రబలకుండా, వసతి గృహ పరిసరాలలో వర్షపు నీరు నిలువకుండా నిత్యం పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాలని ఐటిడిఏ పిఓ సూచించారు. ప్రతి రోజు వంటగది, స్టోర్ రూమ్, తాగునీరు, మరుగుదొడ్లు శుభ్రంగా ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.
అనంతరం తరగతి గదిలో విద్యార్థులకు పాఠాలు బోధించి, సబ్జెక్టుల వారీగా ప్రశ్నలు అడిగి సమాధానాలు తెలుసుకున్నారు. ప్రతి విద్యార్థికి చదవడం, రాయడం తప్పనిసరిగా రావాలని ఉపాధ్యాయులకు సూచించారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని ఔషధాలను, రిజిస్టర్ లను పరిశీలించారు. ఆసుపత్రికి వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, వర్షాకాలం అయినందున అవసరమైన మందులను అందుబాటులో ఉంచుకోవాలని, వైద్యులు, సిబ్బంది విధుల పట్ల సమయపాలన పాటించాలని తెలిపారు. ఆసుపత్రిలోని వార్డులు, పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని, అంటు వ్యాధులు వ్యాప్తి చెందకుండా పాటించవలసిన జాగ్రత్తలను ప్రజలకు వివరించాలని తెలిపారు. ఈ కార్యక్రమాలలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.