16-09-2025 07:11:09 PM
కరీంనగర్ క్రైమ్ (విజయక్రాంతి): కాకతీయ స్మార్ట్ కిడ్స్ పాఠశాల విద్యార్థులు తమ ప్రతిభతో మరొసారి క్రీడారంగంలో పాఠశాలకు గౌరవం తీసుకొచ్చారు. ఇటీవల అనగా సెప్టెంబర్ 14న కరీంనగర్ లోని రేకుర్తిలో గల ఒక ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన సౌత్ ఇండియా ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ 2025లో పాల్గొని మొత్తంగా 23 పథకాలు సాధించడం విశేషం. ఈ పోటీలలో వివిధ రాష్ట్రాల నుండి వందలాది మంది పోటీదారులు పాల్గొన్న సందర్భంలో కాకతీయ స్మార్ట్ కిడ్స్ విద్యార్థులు అత్యుత్తమ క్రీడా స్ఫూర్తి, క్రమశిక్షణ, కృషి కనబరిచి విశేష విజయాన్ని సాధించారు. వారి ఈ ప్రదర్శనను గుర్తించి కరీంనగర్ జిల్లా పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం విద్యార్థులను స్వయంగా అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ "క్రమశిక్షణతో, నిబద్ధతతో కృషి చేస్తే భవిష్యత్తులో జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో కూడా ప్రతిభ చాటగలరు" అని విద్యార్థులకు ప్రోత్సాహం అందించారు.
ఆ తర్వాత పాఠశాల కరస్పాండెంట్ గున్నాల క్రాంతి కుమార్ మాట్లాడుతూ "మా విద్యార్థులు 23 పథకాలు సాధించడం పాఠశాలకే గర్వకారణం తల్లిదండ్రుల ప్రోత్సాహం గురువుల కృషి, విద్యార్థుల పట్టుదలతో ఈ విజయాలు సాధ్యమయ్యాయి. పాల్గొన్న మొదటి టోర్నమెంట్ లోనే ఇంతటి ప్రతిభ కనబర్చినందుకు చాలా సంతోషాన్ని వ్యక్త పరిచారు. భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించేలా క్రీడారంగంలో పూర్తిస్థాయి సహకారం అందిస్తాం" తెలిపారు. ఆ తర్వాత పథకాలు సాధించిన విద్యార్థులు అందరిని పాఠశాలలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమములో అభినందించారు. ఇట్టి కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ గున్నాల క్రాంతి కుమార్, ప్రిన్సిపల్ గున్నాల అర్చన, వైస్ ప్రిన్సిపల్ పెద్ది సందీప్, కరాటే ఇన్స్ట్రక్టర్లు ప్రసన్న కృష్ణ, దేవేందర్ లు, అధ్యాపక బృందం మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.