21-10-2025 10:04:51 PM
రూ.10,40,089/- నగదు, 321 మొబైల్స్, 45 మోటార్ సైకిళ్లు స్వాధీనం..
జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర..
కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా జూదం(పేకాట) ఆడుతున్న వారిపై పోలీసులు దాడులు నిర్వహించారు. వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో జరిగిన ఈ దాడుల్లో మొత్తం 82 కేసులు నమోదు చేసి 469 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. వారి వద్ద నుండి పోలీసులు రూ.10,40,089/- నగదు, 321 మొబైల్ ఫోన్లు, 45 మోటార్ సైకిళ్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మంగళవారం జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర, మాట్లాడుతూ పేకాట వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలు వ్యక్తి, కుటుంబం, సమాజానికి ఘోరమైన హాని కలిగిస్తాయన్నారు. ఇవి వ్యక్తులను అప్పుల్లో నింపి ఆర్థిక విధ్వంసానికి గురి చేస్తాయి. కుటుంబాల్లో ఘర్షణలు, నిరాశ, అనాథత్వ భావనలు ఏర్పడతాయి, దారుణ పరిణామాలైన ఆత్మహత్యల వరకూ దారితీయవచ్చన్నారు.
ఆత్మీయుల భావోద్వేగం, పిల్లల భవిష్యత్తు.. ఇవన్నీ జూదం వల్ల ప్రమాదంలో పడతాయి అని ఎస్పీ తెలిపారు. జూదం ఇతర చట్టవ్యతిరేక కార్యక్రమాలను నిరోధించడం అందరి సామాజిక బాధ్యత అన్నారు. కుటుంబ శ్రేయస్సు, సమాజ భద్రత కోసం ఇటువంటి కార్యకలాపాల నుండి పూర్తిగా దూరంగా ఉండాలని అన్నారు, జిల్లా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అలాగే గ్రామాలు, పట్టణాలు, ఫామ్ హౌస్‌లు, ఇళ్లు, బహిరంగ ప్రదేశాల్లో జూదం (పేకాట) లేదా ఇతర చట్టవ్యతిరేక కార్యక్రమాలు ఎవరైనా నిర్వహిస్తున్నట్లు తెలిసినా లేదా ఎవరు ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నట్లు సమాచారం ఉన్నా, వెంటనే పోలీస్ కంట్రోల్ రూమ్ నంబర్ 87126 86133, 100 డయల్ చేయాలన్నారు. సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారుల కు సమాచారం ఇవ్వాలని ఆయన సూచించారు. సమాచారం అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచ నున్నట్లు తెలిపారు.