calender_icon.png 18 December, 2025 | 7:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతుల అవసరాలకు సరిపడా అందుబాటులో యూరియా ఎరువులు

16-12-2025 12:00:00 AM

కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఎరువుల గిడ్డంగి ఆకస్మికంగా తనిఖీ 

నిజామాబాద్, డిసెంబర్ 15 (విజయక్రాంతి) : జిల్లాలో ప్రస్తుత యాసంగి సీజన్ పంటల సాగు కోసం రైతుల అవసరాలకు సరిపడా యూరియా ఎరువుల నిల్వలు అందుబాటులో ఉన్నాయని, ఎరువుల విషయంలో ఎవరు కూడా ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి స్పష్టం చేశారు. డిచ్పల్లి మండలం సుద్దులం సహకార సంఘం ఎరువుల గోడౌన్ ను కలెక్టర్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

గిడ్డంగిలో అందుబాటులో ఉన్న ఎరువుల నిల్వలను పరిశీలించారు. ఎరువుల కొనుగోలు కోసం వచ్చిన రైతులను కలెక్టర్ పలుకరించి, సరిపడా ఎరువులు అందుతున్నాయా అని ఆరా తీశారు. యాసంగి సీజన్ కు సంబంధించి జిల్లాకు 32 వేల మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయని, క్రమం తప్పకుండా ఎరువుల స్టాక్ జిల్లాకు వస్తోందని కలెక్టర్ తెలిపారు.

అన్ని ప్రాంతాలలో రైతులకు ఎరువులు అందేలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తున్నామని, ఎట్టి పరిస్థితుల్లో ఎరువుల కొరత తలెత్తకుండా చూస్తామని భరోసా కల్పించారు. ఈ మేరకు కట్టుదిట్టమైన పర్యవేక్షణ చేస్తున్నామని అన్నారు. రైతులు ఒకేసారి ఎరువులను కొనుగోలు చేసి అట్టిపెట్టుకోకుండా, విడతల వారీగా తమ అవసరాలకు అనుగుణంగా ఎరువులు తీసుకోవాలని హితవు పలికారు. దీనివల్ల ఇతర రైతులకు కూడా ఎరువులు అందుబాటులో ఉంటాయన్నారు.

నానో యూరియా వాడకం పై రైతులకు అవగాహన కల్పించాలని, డ్రోన్ వినియోగం ద్వారా ఎరువుల వాడకం గురించి ప్రయోగాత్మకంగా అవగాహన కల్పించాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. అదేవిధంగా ఎరువులు పక్కదారి పట్టకుండా గట్టి నిఘా ఉంచాలని, ఎరువుల విక్రయాల్లో అక్రమాలకు తావు కల్పించే వారిపై కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. కాగా, ఖరీఫ్ సీజన్ లో తమకు పూర్తి స్థాయిలో ఎరువులు లభించాయని, ఎలాంటి కొరత తలెత్తలేదని రైతులు సంతృప్తి వ్యక్తం చేశారు. కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయ అధికారి వీరాస్వామి, తహసిల్దార్ సతీష్, స్థానిక అధికారులు ఉన్నారు.