calender_icon.png 7 July, 2025 | 8:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యూకే టెలికాం కంపెనీలో సునీల్ మిత్తల్‌కు వాటా

13-08-2024 01:37:54 AM

న్యూఢిల్లీ: యూకేకు చెందిన ప్రముఖ టెలికాం కంపెనీ బ్రిటిష్ టెలికాం గ్రూప్‌లో సునీల్ మిత్తల్  నేతృత్వంలోని భారతీ గ్లోబ ల్ సంస్థ వాటాలు కొనుగోలు చేయనుంది. ఆల్టిస్ యూకే నుంచి 24.4 శాతం వాటా కొనుగోలు చేయనునున్నట్లు కంపెనీ సోమవారం వెల్లడించింది. ఎయిర్‌టెల్ భారతీ ఎంటర్ ప్రైజెస్‌కు చెందిన ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్‌మెట్ సంస్థే ఈ భారతీ గ్లోబల్. భారతీ టెలీవెంచర్స్ యూకే ద్వారా ఈ షేర్లను కొనుగోలు చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. వాటాల కొనుగోలుకు ఆల్టిస్ యూకేతో భారతీ టెలీ వెంచర్స్ సంస్థ బైండింగ్ అగ్రిమెంట్‌ను కుదుర్చుకుంది.

9.99 శాతం వాటాను సత్వరం కొనుగోలు చేసేందుకు, మిగిలిన 14.51 శాతం వాటాలను నియంత్రణ సంస్థల ఆమోదం అనంతరం కొను గోలు చేయాలని నిర్ణయించినట్లు కంపెనీ తెలిపింది. ఎంత మొత్తానికి కొనుగోలు చేసిందీ మాత్రం వెల్లడించలేదు. బీటీ గ్రూప్ విలువ సుమారు 15 బిలియన్ డాలర్లు ఉండొచ్చని మార్కెట్ విశ్లేషకుల అంచనా. ఆ లెక్కన ఈ డీల్ విలువ 4 బిలియన్ డాలర్లు ఉంటుందని పేర్కొంటున్నారు.భారత్‌తోపాటు వివిధ దేశాల్లో భారతీ గ్రూప్‌నకు చెందిన ఎయిర్‌టెల్ టెలికాం సేవలందిస్తోంది.

తాజా పెట్టుబడులు భారత్, యూకే మధ్య ఏఐ, 5జీ, ఆర్‌అండ్‌డీ, కోర్ ఇంజినీరింగ్ వంటి రంగాల్లో సమష్ట ఫలితాలు ఇస్తాయని భారతీ సంస్థ భావిస్తోంది. టెలికాం రంగంలో అనుసరిస్తున్న కొత్త పద్ధతులను అనుసరించేందుకూ వీలవుతోందని అనుకుంటోంది. భారతీ, బ్రిటిష్ టెలికాం సంస్థ మధ్య రెండు దశాబ్దాల అనుబంధం ఉందని ఈ సందర్భంగా సునీల్ భారతీ మిత్తల్ గుర్తుచేశారు.