3 July, 2026 | 9:50 AM

యూరియా సరఫరా చేయండి

17-09-2025 02:14 AM
  1. యాసంగికి ముందే ప్రతి నెలా 2లక్షల టన్నుల చొప్పున ఇవ్వాలి
  2. కేంద్రమంత్రి అనుప్రియ పటేల్‌ను కోరిన రాష్ట్ర మంత్రి తుమ్మల
  3. కొత్తగూడెంలో గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం ఏర్పాటుపై పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడితో చర్చ

హైదరాబాద్, సెప్టెంబర్ 16 (విజయక్రాంతి) : తెలంగాణకు కేటాయించిన యూరియాను పూర్తిగా సరఫరా చేయాలని కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్‌కు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. వానాకాలం సీజన్‌లో ప్రణాళిక ప్రకారకం ఇప్పటి వరకు ఏర్పడిన యూరియా లోటు 2లక్షల టన్నులను ఈ నెలలోనే భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఢిల్లీలో కేంద్ర మంత్రులు అనుప్రియ పటేల్, శివరాజ్‌సింగ్ చౌహాన్, రామ్మోహన్ నాయుడిని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మంగళవారం వేర్వేరుగా కలిసి వివిధ సమస్యలపై విజ్ఞప్తులు చేశారు. వచ్చే రబీ సీజన్‌కు రైతాంగానికి ఇబ్బంది కలగకుండా ముందు జగ్రత్తగా ప్రతి నెలా 2లక్షల టన్నుల చొప్పున యూరియాను సరఫరా చేయాలని కోరారు.   

కృషి విజ్ఞాన కేంద్రాలు మంజూరు చేయండి 

రాష్ట్రానికి కొత్తగా మరో 16 కృషి విజ్ఞాన కేంద్రాలు మంజూరు చేయాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌ను రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు వినతిపత్రం ఇచ్చారు. రాష్ట్రంలో రైతులు అధిక శాతం చిన్న, సన్నకారులే ఉన్నారని, వీరికి సాంకేతిక, వ్యవసాయ మద్దతు అవసరమన్నారు.

రాష్ట్రంలో ఉద్యాన పంటల విస్తీర్ణం పెరుగుతోందని, అ యినా కేవలం 16 జిల్లాలో మాత్రమే కృషి విజ్ఞాన కేంద్రాలు పని చేస్తున్నాయన్నారు. అనంతరం తుమ్మల కేంద్రమంత్రి రామ్మోహస్ నాయుడితో సమావేశమై కొత్తగూడెంలో గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం ఏర్పాటుపై చర్చించారు.